నాయకి నా కెరీర్‌లో కీలకం
నాయకి చిత్రం నా కెరీర్‌లో కీలకం అవుతుందనే నమ్మకాన్ని నటి త్రిష వ్యక్తం చేశారు. ఈమె తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నాయకి ఆమె పీఏ గిరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. నవ దర్శకుడు గోవి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కె సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, మనోబాలా, కోవై సరళ, సత్యన్‌రాజేష్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తనకు పీఏ గాను నాయకి చిత్రానికి నిర్మాతగాను గిరిధర్ చాలా కష్టమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు. గత ఆరేళ్లుగా ఆయన తనకు పీఏగా పనిచేస్తున్నారని మూడేళ్ల క్రితం ఈ చిత్రం గురించి తనకు చెప్పారని అన్నారు.
దర్శకుడు గోవి ఒక గంటలో నాయకి చిత్ర కథ గురించి చెప్పారన్నారు. ఆయన నెరేట్ చేసిన విధమే తనకు బాగా నచ్చిందన్నారు. ఇది హార్రర్ కామెడీ కథా చిత్రం అని తెలిపారు. పూర్తి హార్రర్ కథా చిత్రం చేయాలన్న ఆకాంక్ష చాలా కాలంగా ఉందన్నారు. అరణ్మణై -2 చిత్రం చేస్తున్నదానికి ఈ చిత్రానికి ఎలాంటి పోలికలు ఉండవన్నారు. ఇది 1980లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో దెయ్యం హత్యలు చేస్తుందా? లేక వ్యక్తి పగ, ప్రతీకార ఇతివృత్తమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. తానిప్పటి వరకు చాలా చిత్రాలు చేశానని వాటికి భిన్నంగా చేయాలన్న భావనే ఈ నాయకి చిత్ర తెరరూపానికి కారణం అని అన్నారు. నటి నయనతార మాయ అనే హార్రర్ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆమెకు పోటీగా మీరీ చిత్రంలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానెవరితో పోటీ పడనని నయనతార నటిస్తున్న మాయ చిత్ర కథ వేరు తాను చిత్ర కథ వేరని ఈ సందర్భంగా అన్నారు.
గాయని అవతారం : కాగా నటి త్రిష ఈ చిత్రం ద్వారా గాయనిగా కూడా అవతారమెత్తనుండడం విశేషం. చిత్ర సంగీత దర్శకుడు రఘుకుంచె త్రిషతో ప్రమోషన్ సాంగ్‌ను పాడించనున్నారట. దీని గురించి త్రిష వెల్లడిస్తూ రఘు కంచె పాడమని కోరడంతో సరే నన్నానని అయితే ఇంటర్వ్యూలో రెండు లైన్లు పాడడానికే చెమటలు పట్టేశాయని అలాంటిది ఈ చిత్రంలో ఎలా పాడుతానో అన్న చిన్న సంకోచం లేకపోలేదని ఆమె అన్నారు. గాయనిగా కొనసాగుతానా అన్నది ఈ చిత్రంలో పాటకు స్పందనను బట్టి ఉంటుందని ఈ చెన్నై చిన్నది త్రిష అన్నారు.