ప్రఖ్యాత సినీ గాయని ఎంఎస్.రాజేశ్వరి (87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. రాజేశ్వరి పూర్తి పేరు మదురై శఠగోపన్ రాజేశ్వరి. శఠగోపన్, రాజసుందరి కూతురైన రాజేశ్వరి 1932 ఫిబ్రవరి 24న చెన్నైలో జన్మించారు. రాజేశ్వరి తల్లి రంగస్థల నటి. బామ్మ కన్నామణియమ్మాళ్ కర్ణాటక సంగీత గాయని. ఎంఎస్.రాజేశ్వరి 12 ఏళ్ల ప్రాయంలోనే గాయనిగా పరిచయం అయ్యారు. రాజేశ్వరిని ప్రఖ్యాత దివంగత దర్శకుడు బీఆర్.పంతులు స్టార్ ప్రొడక్షన్స్ సంస్థలో పరిచయం చేశారు. 1946లో ‘విజయలక్ష్మి’ అనే చిత్రంలో తొలిసారిగా పాడారు.
గోవిందరాజులు నాయుడు సంగీత దర్శకత్వంలో ‘మైయల్ మిగవుమ్ మీరుదే’ అనే పాటను పాడారు.ఆ తరువాత ‘సంసార నౌక’ చిత్రంలో ఒక పాట పాడారు. 1948లో ‘రాజముక్తి’ చిత్రంలో త్యాగరాజ భాగవతార్‌తో కలిసి ‘కణ్వళి నుళైందు ఎన్ ఉళ్లమ్ కవంర్ద ’ అనే పాటను పాడారు. అయితే ఈ పాట చిత్రంలో చోటు చేసుకోలేదు. కాగా ఏవీఎం సంస్థలో కంపెనీ గాయనిగా ఏడు సంవత్సరాలు తన సేవలను అందించారు. ఆ సంస్థ నిర్మించిన ‘నామ్ ఇరువర్’ చిత్రంలోని ‘మహాన్ గాంధీ మహాన్..’ అనే పాట ఎంతో పాచుర్యం పొందింది. అప్పట్లో చిన్నారుల గొంతుకు రాజేశ్వరి గుర్తింపు పొందారు.
మియా మియా పూనైకుట్టి, కోళి ఒరు గూట్టిలే సేవల్ ఒరు గూట్టిలే లాంటి పలు పాటలు రాజేశ్వరి గానంతో మధుర గీతాలుగా నేటికీ వినిపిస్తున్నాయి. తమిళ, తెలుగు మొదలగు దక్షిణాది భాషల్లో 500లకు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆమె చివరిగా ‘శివరాత్రి’ (1993) సినిమాలో ‘నటరాజు హారాన్ని నాగరాజు..’ ఆనే పాట పాడారు. ఏవీ. మెయ్యప్పన్ నుంచి బీఆర్. పంతులు, సోము, బీమ్సింగ్, పి.నీలకంఠన్, ఎంవీ.రామన్, కేవీ.శ్రీనివాసన్, మణిరత్నం, రామనాథన్ తదితర పలువురు దర్శకుల చిత్రాల్లో రాజేశ్వరి ఆలపించారు. ఎంఎస్.రాజేశ్వరికి వెంకటేశన్ అనే కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అనారోగ్యంతో మరణించిన రాజేశ్వరి భౌతికకాయానికి గురువారం సాయంత్రం క్రోమ్‌పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment