23 ఏళ్ల తర్వాత డ్రీమ్ నెరవేరింది!
లాస్ ఏంజిల్స్: 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. ఐదు నామినేషన్లు. అయినా అందకుండా ఊరిస్తున్న ఆస్కార్. ఎట్టకేలకు 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో కల నెరవేరింది. థ్రిల్లర్ డ్రామా 'ద రెవెనంట్' సినిమాలో చూపిన తన నటవిశ్వరూపానికిగాను డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ ట్రోపీని అందుకున్నాడు. 'రెవెనంట్' సినిమాలో పగ తీర్చుకునే ఫర్ ట్రాపర్ పాత్రలో అసాధారణ అభినయాన్ని చూపిన డికాప్రియో అకాడమీ పురస్కారాన్ని అందుకొని భావోద్వేగంతో ప్రసంగించాడు. సినిమా దర్శకుడు ఇనారితు, సహ నటుడు టామ్ హార్డీతోపాటు చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రకృతి ప్రేమికుడైన డిక్రాపియో ఈ సందర్భంగా పర్యావరణ అంశాన్ని ప్రస్తావించాడు. 'సహజమైన ప్రపంచంతో మనిషి అనుబంధాన్ని మా 'రెవెనంట్' సినిమా చాటింది. వాతావరణం మారుతున్న సంగతి వాస్తవం. ఇది ప్రస్తుతం జరుగుతోంది. మన భూగోళంపై ప్రభావం చూపుతోంది. యావత్ జీవకోటి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు ఇది. దీనిని అడ్డుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన అవసరముంది' అని డికాప్రియో పేర్కొన్నాడు.
డికాప్రియో 'రెవెనంట్' సినిమా బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన ఖాతాలో వేసుకున్నా.. అనూహ్యంగా 'స్పాట్ లైట్' సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ను ఎగరేసుకుపోవడం గమనార్హం.