The Revenant
-
ఒక్క నిమిషంలో 4 లక్షల ట్వీట్లు
23 ఏళ్ల నిరీక్షణ తరువాత కల నిజం చేసుకున్న హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, అదే రోజు మరో అరుదైన రికార్డ్ సృష్టించాడు. 'ద రివెనెంట్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న డికాప్రియోకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 88వ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్లో ఉత్తమ నటుడిగా డికాప్రియో అవార్డ్ అందుకున్న మరుక్షణం ఆయన ట్విట్టర్ పేజ్‌పై భారీ సంఖ్యలో విషెస్ పోస్ట్ అయ్యాయి. ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం)జరిగిన అవార్డ్ వేడుకల్లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్నాడు డికాప్రియో. అవార్డ్ ప్రదానం అయిన తొలి నిమిషంలోనే ఏకంగా 4 లక్షల 40 వేల శుభాకాంక్షల పోస్ట్‌లు వచ్చాయి. ఆ తరువాత ఉత్తమ చిత్రాన్ని ప్రకటించిన తరువాత కూడా ఇదే స్థాయిలో శుభాకాంక్షల ట్వీట్లు వచ్చాయి. -
23 ఏళ్ల తర్వాత డ్రీమ్ నెరవేరింది!
లాస్ ఏంజిల్స్: 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. ఐదు నామినేషన్లు. అయినా అందకుండా ఊరిస్తున్న ఆస్కార్. ఎట్టకేలకు 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో కల నెరవేరింది. థ్రిల్లర్ డ్రామా 'ద రెవెనంట్' సినిమాలో చూపిన తన నటవిశ్వరూపానికిగాను డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ ట్రోపీని అందుకున్నాడు. 'రెవెనంట్' సినిమాలో పగ తీర్చుకునే ఫర్ ట్రాపర్ పాత్రలో అసాధారణ అభినయాన్ని చూపిన డికాప్రియో అకాడమీ పురస్కారాన్ని అందుకొని భావోద్వేగంతో ప్రసంగించాడు. సినిమా దర్శకుడు ఇనారితు, సహ నటుడు టామ్ హార్డీతోపాటు చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రకృతి ప్రేమికుడైన డిక్రాపియో ఈ సందర్భంగా పర్యావరణ అంశాన్ని ప్రస్తావించాడు. 'సహజమైన ప్రపంచంతో మనిషి అనుబంధాన్ని మా 'రెవెనంట్' సినిమా చాటింది. వాతావరణం మారుతున్న సంగతి వాస్తవం. ఇది ప్రస్తుతం జరుగుతోంది. మన భూగోళంపై ప్రభావం చూపుతోంది. యావత్ జీవకోటి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు ఇది. దీనిని అడ్డుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన అవసరముంది' అని డికాప్రియో పేర్కొన్నాడు. డికాప్రియో 'రెవెనంట్' సినిమా బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన ఖాతాలో వేసుకున్నా.. అనూహ్యంగా 'స్పాట్ లైట్' సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ను ఎగరేసుకుపోవడం గమనార్హం. -
'ఆ స్ట్రాంగ్ లీడర్లా నటించాలని ఉంది'
ప్రపంచంలో బలమైన నాయకుడు, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. రష్యాను తిరుగులేకుండా పరిపాలిస్తున్న ఆయనకు వివాదాస్పదుదిగానూ పేరుంది. విలక్షణమైన నేతగా పేరొందిన ఆయన పాత్రను పోషించాలని 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో ముచ్చటపడుతున్నారు. తాజాగా 'రెవెనంట్' సినిమాలో హూ గ్లాస్‌గా నటించి అదరగొట్టిన ఈ 41 ఏళ్ల హీరో తన అభినయానికి ఆస్కార్ నామినేషన్ పొందారు. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. 'ద వోల్ఫ్ ఆఫ్ వాల్‌స్ట్రీట్' వంటి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన డికాప్రియో తాజాగా తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. 'పుతిన్ చాలా ఆసక్తికరమైన వ్యక్తి. ఆయన పాత్ర పోషించడం నాకెంతో ఇష్టం' అని ఈ హాలీవుడ్ స్టార్ తెలిపారు. అంతరించిపోతున్న సైబీరియన్ పులుల సంకరక్షణపై అవగాహన కోసం 2010లో ఓసారి పుతిన్‌ను డికాప్రియో స్వయంగా కలిశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులుల సంరక్షణ గురించి అప్పట్లో పుతిన్‌తో చర్చించినట్టు ఆయన చెప్పారు. -
ఆమెకు అవార్డుతో బిత్తరపోయిన హాలీవుడ్ స్టార్!
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిగ్గా మారింది. 'అమెరికన్ హర్రర్ స్టోరీ: 'హోటల్'లో నటనకుగాను టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డును పాప్ సింగర్ లేడి గాగాకు ప్రకటించారు. స్టేజ్‌కి దూరంగా కూచున్న గాగా ఆదరాబాదరాగా నడుచుకుంటూ.. తన చుట్టూ కూచున్న నటుల మధ్య నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కూర్చిపై కూర్చొని ఉన్న లియోనార్డో డీకాప్రియో మోచేతిని గాగా బలంగా తోసుకుంటూ పోయింది. అతని మోచేయి తనకు తాకిందన్న విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ లియోనార్డో మాత్రం బిత్తరపోయి ఆమె వంక చూశాడు. ఆ చూపు కెమెరాకు చిక్కి.. అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. అసలు 'రెవెనంట్' సినిమాలో నటించినందుకు కాదు అలా బిత్తరపోయి చిత్రంగా గాగా వంక చూసినందుకు లియోనార్డోకు 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు ఇవ్వాలంటూ ఆన్లైన్లో జోకులు పేలుతున్నాయి. హర్రర్ టీవీ షోలో రక్తాన్ని పీల్చే గబ్బిలంలా గాగా నటనకు 'గోల్డెన్ గ్లోబ్' రావడంపై బెస్ట్ రియాక్షన్ అవార్డు లియోకే ఇవ్వాలంటూ నెటిజన్లు వ్యంగ్య పోస్టులతో హోరెత్తిస్తున్నారు. scuse u https://t.co/dNlwVvHkCN — LW (@lindseyweber) January 11, 2016 -
'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం
కాలిఫోర్నియా: 73 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ తారల వెలుగుజిలుగుల మధ్య ఆద్యంతం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడి అవార్డు 'టైటానిక్' స్టార్ లియోనార్డ్ డీకాప్రియోను వరించింది. డ్రామా కేటగిరిలో 'ద రెవెనంట్' సినిమాలో చూపిన అభినయానికిగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ నటి పురస్కారాన్ని బ్రీ లార్సన్ కైవసం చేసుకుంది. డ్రామ కేటగిరీలో 'రూమ్' సినిమాలో చూపిన నటనకుగాను ఆమెను ఈ అవార్డు వరించింది. డ్రామా కేటగిరీలో ఉత్తమ చిత్రంగా 'రెవెనంట్' నిలువగా, మ్యూజికల్, కామెడీ కేటగిరీలో 'మార్షియన్' ఉత్తమ సినిమా అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది 'రెవెనంట్' చిత్రం అధిక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతో సత్తా చాటింది. డ్రామా కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా 'రెవెనంట్' డైరెక్టర్ అలెజాండ్రో ఇనారితును వరించింది. ఇక మ్యూజికల్ కామెడీ కేటగిరీలో ఉత్తమ నటుడిగా మాట్ డామన్ (మార్షియన్), ఉత్తమ నటిగా జెన్నిఫర్ లారెన్స్ (జాయ్) పురస్కారాలు దక్కించుకున్నారు. ఇక 'క్రీడ్' సినిమాకుగాను సీనియర్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం గెలుపొందారు.