
ఎమ్మెస్ నవాబ్ బాషా
ఎమ్మెస్ నారాయణ ‘నవాబ్ బాషా’గా రాబోతున్నారు. బి.రాజేశ్‌పుత్ర స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్నవాడిగా చిత్రాన్ని మలిచాడని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని ఎమ్మెస్ నారాయణ అన్నారు. రాజేశ్‌పుత్ర మాట్లాడుతూ- ‘‘నవాబుగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బీదరికం అనుభవిస్తున్న ఓ వ్యక్తి కథ ఇది.
బీదరికంలో కూడా అతను ఇతరులకు ఎలా సహకరించాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. నవాబుల కాలం నాటి యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎమ్మెస్ నారాయణ పాత్ర ఈ చిత్రానికి హైలైట్. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది. త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. రాహుల్, వరుణ్, జూనియర్ నగ్మా, శాంతి స్వరూప్, జెన్నీ, స్నేహ, విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.శ్రీనివాసరెడ్డి, సంగీతం: బోలె, సునిల్‌పుత్ర, కూర్పు: సునిల్.