కమల్, నాజర్, విశాల్‌కు హైకోర్టు నోటీసులు
చెన్నై: నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో నటుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే చెన్నై, తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌సంఘం సభ్యుడు చెన్నై నగర హక్కుల విభాగంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నడిగర్ సంఘం 62వ సర్వసభ్య సమావేశంలో సంఘ భవనాన్ని నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారన్నారు. అదే విధంగా సంఘ సభ్యులతో చర్చించకుండానే బెంగళూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో సంఘ భవన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసి సంఘ సభ్యులందరితో చర్చించి నూతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.