సామరస్యంగా పరిష్కరించుకోండి
పెరంబూర్: నటి రంభ, ఆమె భర్త ఇంద్రకుమార్ తమ సమస్యలను సామరస్యంగా చర్చిం చుకుని పరిష్కరించుకోవాలని చెన్నై హైకోర్టు సూచించింది. వివరాలు.. నటి రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కెనడాలో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రంభకు ఇంద్రకుమార్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంలో రంభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నైకి తిరిగొచ్చేశారు.
కాగా 2016లో భర్తతో తనను కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు, కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పిల్లల విద్య, సంరక్షణ ఖర్చుల కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన ఇద్దరు పిల్లలతో కోర్టుకు హాజరయ్యారు. అదే విధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారు. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.