ముంబై : కొందరు దిగ్గజాలు మనల్ని విడిచిపెట్టి వెళ్లినప్పుడు వారి సేవలకు గుర్తుగా ఊరి పేరును మార్చడం లేదా అతని పేరు మీద సామాజిక కార్యక్రమాలు చేయడం చూస్తుంటాం. తాజాగా బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు అలాంటి గౌరవమే లభించింది. మహారాష్ట్రలోని ఇగాత్ పురి గ్రామస్తులు ఇర్ఫాన్ గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా ఊరికి అతని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మనల్ని విడిచిపెట్టి రెండు వారాలు కావొస్తున్న అతని జ్ఞాపకాలతో ఇంకా మన మధ్యలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. కేవలం తన నటనతో కోట్లాది మందిని తన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎంతో చిన్నస్థాయి నుంచి వచ్చిన ఇర్ఫాన్ చాలా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎప్పటికి గుర్తుంచుకునే నటుడిగా తనకంటూ పేరు సంపాధించాడు. అలాంటి ఇర్ఫాన్‌కు ఇగాత్ పురి గ్రామస్తులు ఊరికి అతని పేరు పెట్టి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదే విషయంపై గ్రామస్తులను ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
(ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు)
ఇగాత్ పురి గ్రామంలో ఇర్ఫాన్ కొంత భూమిని కొన్నాడని, అతను కొనే సమయానికి ఆ ఊరు ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ తరుణంలోనే ఇర్ఫాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా సరే తాను భూమి కొన్న గ్రామాన్ని కొంతమేరకైనా అభివృద్ధి చేయాలనుకున్నాడు. ఆ ఊరిలో గిరిజన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుసుకున్న ఇర్ఫాన్ వారికి తన వంతు సహాయం చేయాలనుకున్నాడు. ఆ గిరిజన పిల్లలు చదువుకునేందుకు పుస్తకాలు, రెయిన్ కోట్స్, స్వెటర్‌లు, ఇతర నిత్యావసరాలు అందించాడు. అంతేగాక వారి కుటుంబసభ్యులతో కలిసి పండుగలను నిర్వహించడమే గాక స్వీట్‌బాక్స్‌లు ఇచ్చేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దగ్గరకు రావొచ్చని ఊరి వాళ్లకు హామీ ఇచ్చాడు. తాజాగా ఇర్ఫాన్ మరణంతో ఇగాత్ పురి గ్రామం మూగబోయింది. తమ ఇంటి మనిషినే కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. తమ గ్రామానికి ఎంతో సేవ చేసిన ఇర్ఫాన్‌కు గుర్తుగా తమ ఊరికి అతని పేరు పెట్టడమే సరైన నిర్ణయమని గ్రామస్తులు భావించారు.
2018లో న్యూరో ఎండోక్రైన్ సంబంధిత ట్యూమర్‌కు గురైన 53 ఏళ్ల ఇర్ఫాన్ లండన్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేసుకొని వచ్చాడు. అప్పటి నుంచి కాస్త అనారోగ్యంగానే ఉన్న ఇర్ఫాన్ ఏప్రిల్ 29, 2020న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు.
(అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్)
Comments
Please login to add a commentAdd a comment