
సూపర్ స్టార్ vs సూపర్ స్టార్
దక్షిణాదిలో ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు టాప్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో తెలుగు, తమిళ భాషల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరి సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రాలు కావటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఒకేసారి బరిలో దిగుతున్న ఆ ఇద్దరు హీరోలు ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా, మరొకరు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్.
మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పివిపి సంస్థ భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తోంది. శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల వసూళ్లను సాధించిన మహేష్, ఈ సినిమాతో మరోసారి రికార్డ్లు తిరగరాయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు డేట్ ఎనౌన్స్ చేయకపోయినా మే చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కబాలి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మే చివరి వారంలోనే తన సినిమా రిలీజ్కు రెడీ అవుతున్నాడు. వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న రజనీ, ఈ సారి యంగ్ డైరెక్టర్ పా రంజిత్తో కలిసి భారీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తుండగా, ధన్సిక, ప్రకాష్ రాజ్, కిశోర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇలా ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి బాక్సాఫీస్ ముందు తలపడుతుండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే వీరిలో ఒకరితో ఒకరికి పోటి లేకపోవటం, ఇద్దరికీ సొంతం మార్కెట్ బలంగా ఉండటంతో బిజినెస్ పరంగా పెద్దగా నష్టాలు జరిగే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.