
చలో అమెరికా!
మహేశ్‌బాబు తొలిసారి అమెరికా వెళ్తున్నారు. కాదు.. కాదు.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయన్ని అమెరికా తీసుకు వెళ్తున్నారు. ఏంటి మీరు చెప్పేది? ఇప్పటివరకూ మహేశ్ అమెరికా వెళ్లలేదా? వంశీ పైడిపల్లి తీసుకు వెళ్తున్నారా.. అనుకుంటున్నారా! మహేశ్, వంశీలు అమెరికా వెళ్లేది సినిమా కోసం. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ సినిమాలతో కమర్షియల్ స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల మహేశ్‌బాబుకి ఓ కథ వినిపించారట. అమెరికా నేపథ్యంలో సాగే ఆ కథకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ సినిమాను నిర్మించనున్నారట. వంశీ పైడిపల్లి గత చిత్రం ‘ఊపిరి’ నిర్మించిందీయనే. ఇప్పటివరకూ మహేశ్‌బాబు 22 సినిమాల్లో నటించగా... అమెరికా నేపథ్యంలో కథ సాగిన సినిమా ఒక్కటీ లేదు. అసలాయన సినిమాల్లో ఫారిన్ నేపథ్యంలో సాగిన వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. హాలీవుడ్ హీరోలా కనిపించే మహేశ్‌ను అంతే స్టైలిష్‌గా చూపించడానికి వంశీ పైడిపల్లి రెడీ అవుతున్నారట.
ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు.