‘ఏయ్.. ఏందమ్మీ...’
‘ఓరినీ పాసుగుల్లా...’
‘ఓరి తపేలా మొహమోడా...’
‘నాలెడ్జ్ నేర్చుకుంటే వస్తుందేమో.. యాటీట్యూడ్ పుట్టుకతోనే వస్తుంది’
ఈ డైలాగ్‌లు వింటే నవ్వులే నవ్వులు. డైలాగ్ డెలివరీ, పంచ్‌పవర్, యాస(స్లాంగ్) తీరుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ కామెడీ స్టార్ మహేష్ విట్టా. సోషల్ మీడియా వేదికగా ప్రస్థానం ప్రారంభించి... ‘ఫన్ బకెట్’ వెబ్ సీరిస్‌తో ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నాడీ రాయలసీమ కుర్రాడు. అవకాశలను అందిపుచ్చుకొని తెలుగు తెరపై నవ్వులు పూయిస్తున్నాడు. డైరెక్షన్‌పై ఆసక్తి, దర్శకుడు తేజ స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీలోకి వచ్చానంటున్న మహేష్... ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...
హిమాయత్‌నగర్:
మాది ప్రొద్దుటూరు. చిన్నప్పటి నుంచి డైరెక్షన్‌పై ఆసక్తి. ఏమవుతావని స్కూల్‌లో టీచర్స్ అడిగితే.. సినిమాలకు డైరెక్షన్ చేస్తానని చెప్పేవాడిని. డిగ్రీ తర్వాత ఎంసీఏ చేసేందుకు సిటీకి వచ్చాను. ఈ క్రమంలో 2014లో ‘నేను ఫలానా’ పేరుతో ఓ షార్ట్‌ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. ఈ లఘుచిత్రం ఇండస్ట్రీలోని కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ... అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
యాస ప్లస్.. కామెడీ క్లిక్
ఓసారి షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ హర్ష అన్నవరపు దగ్గరికెళ్లి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశమివ్వాలని అడిగాను. నా దగ్గర ఉన్న స్క్రిప్టులు వినిపించాను. నేను కథ చెప్పిన విధానం, హావభావాలకు ఆకర్షితులైన ఆయన యాక్టర్‌గా చేస్తే బాగుంటుందని సూచించారు. నా స్లాంగ్ (యాస) ఆకట్టుకుంటుందని, కామెడీ చేస్తే క్లిక్ అవుతుందని ప్రోత్సహించారు. అప్పుడే ఆయన ప్రారంభించిన వెబ్ సీరిస్ ‘ఫన్ బకెట్’లో అవకాశమిచ్చారు. అలా సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన నా ప్రస్థానం.. వెండితెరకు చేరింది.
సూపర్ హిట్.. లక్షల్లో వ్యూస్
నేను నటించిన ‘ఎర్రి నా ఎంకటేశ, హెచ్‌టూఓ, బాబు బీటెక్, బాబు బంగారం, ఖేల్‌ఖతం.. దుకాణ్‌బంద్’ తదితర షార్ట్‌ఫిల్మ్‌లు, కామెడీ సీరిస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. వీటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీటిలో నేను చెప్పిన ‘ఏయ్.. ఏందమ్మీ, ఓరినీ పాసుగుల్లా, మో.. మేడమో...’ తదితర డైలాగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
తేజ స్ఫూర్తితో..
నా షార్ట్‌ఫిల్మ్ చూసిన డైరెక్టర్ తేజ గారు ఓ రోజు ఆఫీస్‌కు రమ్మన్నారు. ఇండస్ట్రీలో కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు.. ఆవైపు ఆలోచించు భవిష్యత్ బాగుంటుందని సూచించారు. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. తేజ గారు డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో అవకాశమిచ్చారు. శమంతకమణిలోనూ నటించాను. నేలపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరో నానికి స్నేహితుడిగా చేస్తున్నాను. డైరెక్టర్లు సంపత్ నంది, పూర్ణ ఆనంద్ సినిమాల్లోనూ నటించబోతున్నాను.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదగాలి...
కమెడీయన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో బాగా రాణించాలనే లక్ష్యంతో ఉన్నాను. రావు రమేష్ గారిలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదగాలనే కోరిక బలంగా ఉంది. అందులోనూ నెగెటివ్ రోల్స్ చేయాలనే ఆసక్తి బాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment