‘‘నాది పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామం. అప్పట్లో మా ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతుండేవి. కృష్ణగారి ‘పాడి పంటలు’ షూటింగ్ చూసేందుకు వెళ్లా. జనం ఎక్కువ కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరు సైలెంట్‌గా ఉంటే షూటింగ్ చేస్తాం.. లేకుంటే వెళ్లిపోతాం’ అని కృష్ణగారు అనడంతో నిశ్శబ్దంగా ఉండి షూటింగ్ చూశాం. ఇలాంటి షూటింగ్‌లు చూస్తూ ఉండటంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగి ఇండస్ట్రీకొచ్చా’’ అన్నారు నిర్మాత దానయ్య డీవీవీ. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దానయ్య చెప్పిన విశేషాలు. ∙ఈవీవీ సత్యనారాయణతో కలిసి జంధ్యాలగారి వద్ద అసోసియేట్‌గా వర్క్ చేశా. నా స్నేహితులు భగవాన్, పుల్లారావులతో కలిసి ఈవీవీ దర్శకత్వంలో 1992లో ‘జంబలకిడి పంబ’ సినిమా నిర్మించా. ఆ చిత్రంతో నిర్మాతగా మొదలైన నా ప్రయాణం పాతికేళ్లు అయ్యింది. మహేశ్‌గారితో సినిమా అనుకున్నప్పుడు శివగారు ‘భరత్ అనే నేను’ కథ చెప్పారు. నాకు నచ్చింది. మహేశ్‌గారికీ బాగా నచ్చింది. కథ విన్నప్పుడే కాంప్రమైజ్ కాకుండా సినిమా చేయాలనుకున్నాం. అసెంబ్లీ సెట్‌కు 2 కోట్లు, ‘వచ్చాడయ్యో సామీ’ పాటకు 4 కోట్లు ఖర్చు పెట్టాం. ∙ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కథతో సాగే చిత్రమిది.
ఏ పార్టీకీ సంబంధం ఉండదు. మంచి ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేశాడన్నదే సినిమా. ఎవరినీ విమర్శించేలా ఉండదు. మహేశ్‌గారితో సినిమా చేయడం నా కల. అది కొరటాలగారి ద్వారా కుదరడం హ్యాపీగా ఉంది. ∙మంచి కంటెంట్ ఉంటే నిడివి ఎక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘రంగస్థలం’ సినిమా అందుకు ఉదాహరణ. ఈ నెల 20న ‘భరత్ అనే నేను’ రిలీజ్ అనుకున్నాం. అదే రోజు మహేశ్‌గారి అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు అని మాకు తెలియదు. ఈ విషయాన్ని మహేశ్‌గారు చెప్పారు. మా సినిమా చాలా చాలా బాగుంటుందని దానయ్య అనే నేను హామీ ఇస్తున్నా. మహేశ్‌గారు ఉదయం ఏ మూడ్‌తో నవ్వుతూ షూటింగ్‌కి వస్తారో అదే మూడ్‌తో సాయంత్రం నవ్వుతూ వెళతారు. రామ్‌చరణ్‌గారు హీరోగా బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మిస్తోన్న సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రాజమౌళిగారు, ఎన్టీఆర్‌గారు, చరణ్‌గారు కలిసి చేసే సినిమా ఈ ఏడాదే స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నా. రాజమౌళిగారితో సినిమా చేయడం నా కల. 2006 నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికి కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment