
ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఆధునిక జీవనశైలి, జంక్‌ఫుడ్ కారణంగా స్థూలకాయులుగా మారిన ఎంతోమంది తమకు తోచిన పద్ధుతుల్లో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉందంటే...ఇక సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లింగభేదం లేకుండా ప్రతీ ఒక్కరూ పూర్తి ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లలో చెమటలు కక్కుతున్నారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారీకాయుడిగా తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, దాని నుంచి బయటపడిన తీరు గురించి అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు నెటిజన్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
యుద్ధం చేస్తున్నా..
‘ చిన్నప్పటి నుంచి ఒబేసిటితో ఒక యుద్ధమే చేస్తున్నాను. బాల్యం నుంచి నేను సాగించిన కఠిన ప్రయాణం ఇది. ప్రతీ ఒక్కరి జీవితంలో సవాళ్లు ఉంటాయి. ఒకసారి విఫలమైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. వాటిని అధిగమించడానికి ఓ వారం లేదా ఒక నెల.. కాదంటే సంవత్సరమైనా పట్టొచ్చు. నేను ఈ ఏడాది జనవరిలో శివోహంతో నా ట్రెయినింగ్ ప్రారంభించాను. పానిపట్ సినిమా కోసం ఫౌండేషన్‌లా ఉంటుందని సన్నాహకాలు మొదలుపెట్టాం. నాకు ఇరవై ఏళ్ల వయస్సున్నపుడు 50 కిలోలు తగ్గాలనుకున్నాను. అందుకు నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు ప్రత్యక్ష నరకం చూశాను. అయితే నమ్మకాన్ని కోల్పోలేదు. ఓపిక, సహనంతో ఎదురుచూస్తే కచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగితే..ఈరోజు మనం పడ్డ శ్రమ ఏదోఒక రూపంలో ప్రతిబింబిస్తుంది’ అంటూ అర్జున్ కపూర్ తన వర్కౌట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ క్రమంలో..నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అర్జున్ పోస్టుకు ఫిదా అవుతున్నారు. ‘ నీ పరిధిలో ఉన్న విషయాలను ఎప్పుడూ చేయిదాటి పోనివ్వలేదు. గతంతో పోలిస్తే ప్రతీసారీ నువ్వు కొత్తగా ఉదయిస్తున్నావు. నువ్వు నిజమైన మనిషివి’ అని అతడి సోదరి అన్షులా కామెంట్ చేసింది. ఇక అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరా కూడా అతడి పోస్టుపై స్పందించింది. ‘ విశ్వాసం, కఠినశ్రమ.. ఇది అర్జున్‌కపూర్’ అంటూ రిప్లై ఇచ్చింది. కాగా అర్జున్ కపూర్ ప్రస్తుతం.. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పానిపట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment