'మళ్ళీ రావా' మూవీ రివ్యూ | Malli Raava Movie review | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 8 2017 2:08 PM | Last Updated on Fri, Dec 8 2017 7:10 PM

Malli Raava Movie review - Sakshi

టైటిల్ : మళ్ళీ రావా
జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్
తారాగణం : సుమంత్, ఆకాంక్ష సింగ్,మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క

హీరోగా పదిహేనేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న అక్కినేని వారసుడు సుమంత్ కేవలం 22 సినిమాలు మాత్రమే చేశాడు. వాటిలో సక్సెస్ సాదించిన సినిమాలు మూడు నాలుగుకు మించి ఉండవు. దీంతో ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత చిత్రం నరుడా డోనరుడాతో మరోసారి నిరాశపరిచిన సుమంత్ లాంగ్ గ్యాప్ తరువాత మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మళ్ళీ రావా' సుమంత్ కు సక్సెస్ అందించిందా..?

కథ :
ఈ సినిమా కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష సింగ్)ల ప్రేమకథలు. కార్తీక్.. పద్నాలుగేళ్ల వయసులోనే అంజలితో ప్రేమలో పడతాడు. అది ప్రేమించే వయసుకాదని పెద్దలు చెప్పినా.. నాకు చిన్నప్పటి నుంచే అమ్మ, క్రికెట్, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇష్టమని తెలిసింది.. అలాగే అంజలి అంటే కూడా ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చేస్తాడు. అంజలి కూడా కార్తీక్ ను ఇష్టపడుతుంది. కానీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక్ ను వదిలి వెళ్లిపోతుంది. అలా వదివెళ్లిన అంజలి పదమూడేళ్ల తరువాత తిరిగి కార్తీక్ జీవితంలోకి వస్తుంది. (సాక్షి రివ్యూస్) సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ గా కార్తీక్ పనిచేస్తున్న కంపెనీకే అంజలి ప్రొజెక్ట్ మేనేజర్ గా వస్తుంది. అప్పటికీ కార్తీక్ తననే ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మరోసారి కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. కానీ బాధ్యత లేకుండా ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకున్న కార్తీక్ తో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో మరోసారి కార్తీక్ కు దూరమవుతుంది. అలా దూరమైన కార్తీక్, అంజలిలు తిరిగి కలిశారా..? కార్తీక్ ప్రేమను అంజలి అర్థం చేసుకుందా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ మరోసారి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకున్నాడు. అందమైన ప్రేమ కథలో హుందాగా నటించాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో అంజలిని కలిసినప్పుడు అల్లరి అబ్బాయిగా మెప్పించినా సుమంత్, తరువాత హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉత్తరాది నటి ఆకాంక్ష సింగ్ అంజలి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ విషయంలో తెలుగమ్మాయే అనిపించిన ఈ భామ... పర్ఫామెన్స్ తోనూ మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకాంక్ష నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ఇతర పాత్రల్లో పెద్దగా పరిచయం ఉన్న నటీనటులెవరు కనిపించలేదు. 

విశ్లేషణ :
డబ్బుకోసం కాదు మంచి సినిమా అయితేనే సినిమా చేస్తానన్న హీరో సుమంత్ అందుకు తగ్గట్టుగా అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశల్లో జరిగిన సంఘటనలు ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ దర్శకుడు గౌతమ్ కథ నడిపించిన విధానం ఆకట్టుకుంది. అయితే ఈ తరహా కథనం సామాన్య ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందన్న దాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. మనసును తాకే సంభాషణలతో రూపొందించిన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. మిర్చి కిరణ్ అండ్ గ్యాంగ్ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్) సినిమాకు మరో బలం పాటలు. ఎక్కడ అనవసరంగా ఇరికించినట్టుగా కాకుండా కథతో పాటే నడిచే పాటలో సినిమాలో ప్రేక్షకుణ్ని మరింత ఇన్వాల్వ్ చేస్తాయి. శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రల నటన
సంగీతం

మైనస్ పాయింట్స్ :
సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని కథనం
స్లో నేరేషన్

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement