అక్కణ్ణుంచి ఉత్తరాలు రాస్తా : నాగార్జున
‘‘నాకు తెలిసి చరిత్రలో ఏ నటుడూ చివరి క్షణం వరకు నటించలేదు. ఆ ఘనత నాన్నగారికే దక్కింది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రాలంటే ఆయనకు ఇష్టం. నాన్నగారి చివరి చిత్రం ‘మనం’ ఆ తరహాలోనే ఉంటుంది. అనుకోకుండా ఆ సినిమా కుదరడం, అదే నాన్నగారి చివరి సినిమా కావడం అంతా కాకతాళీయంగా జరిగిపోయింది’’ అని నాగార్జున అన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మనం’ చిత్రం వందరోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
నాగచైతన్య హీరోగా విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ‘ఒక లైలా కోసం’ ఆడియో విజయోత్సవం, ఏయన్నార్ జయంతి వేడుకలు కూడా ఇదే వేదికపై జరిగాయి. ఏయన్నార్ పేరు మీద అమెరికాలో విడుదలైన పోస్టల్ స్టాంప్‌ను అక్కినేని వెంకట్, నాగార్జున, నాగసుశీల విడుదల చేశారు. ఈసారి అమెరికా వెళ్లినప్పుడు ఈ స్టాంప్‌లను ఉపయోగించి తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఉత్తరాలు రాస్తానని ఈ సందర్భంగా నాగ్ పేర్కొన్నారు. తాతయ్య ‘ఒక లైలా కోసం’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో, తాను నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రం కూడా అంతే ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నాగచైతన్య అన్నారు. అఖిల్ మాట్లాడుతూ- ‘‘ఓ బ్లాక్ బస్టర్ చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతోనే నా తొలి చిత్రాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పారు.
అమితాబ్ బచ్చన్‌కి ఏయన్నార్ అవార్డు
సినిమా రంగానికి అద్భుతమైన సేవలు అందించిన ప్రతిభావంతులను గౌరవించాలనే సదుద్దేశంతో అక్కినేని నాగేశ్వరరావు ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశామని అవార్డు కమిటీ ఛైర్మన్ డా. టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ వేడుకలో అమల, విక్రమ్‌కుమార్, విజయ్‌కుమార్, సుశాంత్, పూజ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.