‘మనం’ ఓ ట్రెండ్ సెట్టర్
‘మనం’ ఓ ట్రెండ్ సెట్టర్
Published Fri, Sep 20 2013 12:41 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
‘మనం’ ఫస్ట్ లుక్ అదిరింది కదూ. నాగార్జున సరైన పొజిషన్‌లోనే నిలబడ్డారు కానీ, తాతామనవళ్ల ప్లేస్‌లే తారుమారయ్యాయి. అక్కినేని కూర్చోవాల్సిన ప్లేస్‌లో నాగచైతన్యను కూర్చోబెట్టడంలోనే ఉంది ఇక్కడ వెరైటీ. దీన్ని బట్టి దర్శకుడు విక్రమ్‌కుమార్ సినిమాను ఎంత భిన్నంగా తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
డా.అక్కినేని 90వ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాత అక్కినేని నాగార్జున ఈ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నటిస్తుండటం కొత్త అనుభూతిని అందిస్తోందని, తమ సంస్థలోనే ఇదొక మెమరబుల్ మూవీ అని నాగార్జున అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు దర్శకుణ్ణి కావడం నా అదృష్టం. చక్కని హాస్యం, తీయని ప్రేమానుభూతి, హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రానికి అలంకారాలు.
90 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా అందర్నీ నవ్విస్తూ లొకేషన్‌లో ఓ అందమైన వాతావరణానికి కారకులయ్యారు అక్కినేని. ఈ సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్ అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. నవంబర్ కల్లా నిర్మాణం పూర్తవుతుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై. సుప్రియ చెప్పారు. శ్రీయ, సమంత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, కెమెరా: పీఎస్ వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ.
Advertisement
Advertisement