‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’)లో సభ్యత్వానికి ఎవరు అర్హులో ముందు ‘మా’ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించాలి. ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ విభాగాలవారు కచ్చితమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది పాపులర్ యాక్టర్స్ ‘మా’లో సభ్యులు కారు. వారితో నటించడానికి నాకు అనుమతి ఉందా? ఆరోపణలు, విమర్శలతో ప్రస్తుతం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గ్రీవియన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి.
అంతేకానీ అది ఒక్క ‘మా’ మాత్రమే చేయాల్సింది కాదు’’ అని హీరో–ప్రొడ్యూసర్ మంచు విష్ణు అన్నారు. చిత్రపరిశ్రమ చుట్టూ అల్లుకున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటి శ్రీరెడ్డికి ముందు సభ్యత్వం నిరాకరించి, తర్వాత ఇస్తామంటూ ‘మా’ పేర్కొంది. అసలు ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలంటే ఏ అర్హత ఉండాలి? అని విష్ణు ప్రశ్నించారు. తన మనోభావాలను ఒక లెటర్ ద్వారా వ్యక్తపరిచారు. విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇటీవల ‘మా’ అవలంభిస్తున్న చర్యలు నన్ను బాధించాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమం కోసం ‘మా’ను స్థాపించడం జరిగింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహాయపడే సపోర్టింగ్‌లా ‘మా’ సేవలను విస్తరించుకుంది. ఈ విధి విధానాల వల్లే ‘మా’లో చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. ‘మా’ మెంబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ‘మా’ మెంబర్ కాని ఒకరు రీసెంట్‌గా చేస్తున్న సంఘటలు నన్ను కలవరపరిచాయి. ఆమె చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా ‘మా’ విలేకర్ల సమావేశం నిర్వహించింది.
‘మా’లో సభ్యులుగా ఉన్న 900మంది ఆమెతో నటించకుండా బాయ్‌కాట్ చేస్తున్నట్లు నిర్ణయించింది. మంచిది.. కానీ ఆ 900మందిలో గౌరవనీయులైన మా నాన్నగారు, మా అక్కయ్య, మా తమ్ముడుతో పాటు నేనూ ఉన్నాను. ఒక నిర్మాతగా, ఒక నటుడిగా నాతో ఎవరు నటించాలన్న నిర్ణయం తీసుకునే హక్కు నాది. మీరు (‘మా’ను ఉద్దేశిస్తూ) చెప్పకూడదు. చిత్రపరిశ్రమలోని కొందరిపై విభిన్న ఆరోపణలను ఆమె మరిన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ‘మా’ వెంటనే విలేకర్ల సమావేశం పెట్టి, ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇటువంటి పరిణామాలు మా ‘పై’ వ్యతిరేక భావనను కలిగిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియా నెట్‌వర్క్స్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాపంగా ‘మా’ను చులకనగా చూసే అవకాశం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment