
ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 92ఏళ్ల శర్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. నాగయజ్ఞశర్మ ఆ తరం ప్రఖ్యాత సంగీత దర్శకులెందరితోనో పనిచేశారు. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాలకు మొదటి శిష్యులు. ఆయన అన్ని కచేరిల్లోనూ శర్మ వయొలిన్ వాయించేవారు. ముఖ్యంగా ఘంటసాల భగవద్గీత ఆద్యంతం సహాయకుడిగా పనిచేశారు. ఘంటసాల అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, సుచర్ల దక్షిణామూర్తి వంటి వారి వద్ద మెయిన్ వయొలనిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సంగీతదర్శకుడు రమేశ్‌నాయుడు వద్ద ముఖ్య సహాయకుడిగా స్థిరపడ్డారు.
అప్పట్లో రుద్రవేదం తదితర వేదాలకు అచ్యుత రామశాస్త్రితో కలిసి సంగీత బాణీలు కట్టి కేసెట్ల రూపంలో విడుదల చేసిన ఘనత శర్మదే. శర్మలో మంచి పురోహితుడు కూడా ఉన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల పెద్ద కొడుకుకు ఉపనయనం చేయించి, పెళ్లి చేసింది శర్మనే. ఎందరో వాగ్గేయకారులను సంగీతదర్శకులకు పరిచయం చేసిన ఘనత శర్మది. నాగయజ్ఞశర్మకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. మణిశర్మ మూడవ వారు. చెన్నై, పోరూరు సమీపంలోని కాట్రపాక్కంలో రెండో కొడుకు సూరిబాబు వద్ద నివశిస్తున్న శర్మ మంగళవారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆ సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment