అందుకే పేరు మార్చుకున్నా!
‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. ఓ రొమాంటిక్ ట్విస్ట్ కూడా ఉందండోయ్! కథను ఆసక్తికరమైన మలుపు తిప్పిన ఆ ట్విస్ట్ ఏంటో? చిత్రం చూసి తెలుసుకోండి’’ అని మన్నార్ చోప్రా అన్నారు. సునీల్ సరసన ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘జక్కన్న’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మన్నార్ చోప్రా చెప్పిన ముచ్చట్లు...
ఈ చిత్రంలో స్వీట్, ఇన్నోసెంట్, బబ్లీ పాత్రలో కనిపిస్తాను. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో.. అటువంటి పాత్ర కావడంతో ఈజీగా నటించేశాను. నేను చూసినంత వరకూ తెలుగు సినిమాల్లో హీరోయిన్లు యాక్షన్ చేయడం అరుదు. లక్కీగా నాకు ఈ చిత్రంలో కరాటే, కిక్ బాక్సింగ్ చేసే అవకాశం లభించింది.
హిందీలో డబ్బింగ్ అయిన సునీల్ చిత్రాలు చూశా. తెర మీదే కాదండి.. తెర వెనక కూడా ఎప్పుడూ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు. ఆయనకు ఫ్యాషన్ మీద మంచి అవగాహన ఉంది. నా డ్రస్సింగ్ గురించి సలహాలిచ్చారు. గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేయడంతో సునీల్ పక్కన ఈజీగా డ్యాన్స్ చేశా. సునీల్, సప్తగిరి, నాకు మధ్య సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. దుబాయ్‌లో 55 డిగ్రీల టెంపరేచర్‌లో సాంగ్స్ చిత్రీకరిస్తున్నప్పుడు.. మధ్యలో నా మోకాలికి గాయమైంది. అయినా, షూటింగ్ పూర్తిచేశా.
నిర్మాత సుదర్శన్ రెడ్డి, లతలు నన్నొక కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. ఆర్.పి.ఏ.క్రియేషన్స్ తొలిచిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’ చూశాను. అలాంటి చిత్రం చేయాలనుంది.
మన్నార్ అంటే.. ప్రకాశించేది (సమ్‌థింగ్ దట్ షైన్స్) అని అర్థం. నటిగా నేను ప్రకాశించాలని పేరు మార్చుకున్నా. (అసలు పేరు బార్బీ హండా) ‘తిక్క’లో మంచి పాత్ర చేశా. ప్రయోగాత్మక చిత్రమది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’లో నటిస్తున్నాను.