అవన్నీ చేయగలడని మనోజ్ నిరూపించాడు - దాసరి
‘‘చిన్నప్పుడు మనోజ్‌ని చూసి అల్లరి కుర్రాడు అవుతాడనుకున్నాను. చిత్రపరిశ్రమలో తన భవితవ్యం ఏంటో అని భయపడ్డాను కూడా. కానీ మోహన్‌బాబు తనంత క్రమశిక్షణగా తన బిడ్డల్ని కూడా పెంచగలిగాడు. లక్ష్మి నటిగా, నిర్మాతగా తనేంటో నిరూపించుకుంది. విష్ణు నటు నిగా తన సత్తా ఏంటో తెలియజేశాడు. ఇక మనోజ్... నటునిగా, నిర్మాతగా, రచయితగా, ఫైట్ మాస్టర్‌గా, గాయకునిగా ఇలా పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్నాడు.
చిత్రరంగంలో దాసరి ఏమైతే చేయగలిగాడో.. అవన్నీ చేయగలడని మనోజ్ నిరూపించాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. మనోజ్ కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘పోటుగాడు’. సాక్షి చౌదరి, సిమ్రన్ కౌర్ ముండి, రేచల్ వీస్, అనుప్రియా కోమెంక కథానాయికలు. పవన్ వడయార్ దర్శకుడు. శిరీష-శ్రీధర్ నిర్మాతలు. అచ్చు స్వరాలందించారు. చక్రి ఓ పాటకు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘కన్నడ ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించిన కథ ఇది.
మనోజ్ ఈ సినిమా కోసం ఎన్నో రిస్క్‌లు చేశాడని విన్నాను. నా ఉద్దేశంలో అంత రిస్క్‌లు అనవసరం. పోటుగాడు మనోజ్ కెరీర్‌లో ఓ మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రేమ విఫలం అయ్యిందని చావును ఆశ్రయించి, కన్నవారిని క్షోభ పెట్టడం పిరికివాడి చర్య. దానికంటే... మిలటరీలో చేరి దేశానికి సేవచేస్తే జన్మకు సార్థకత అయినా ఉంటుందని తెలిపే కథ ఇది. ఇంత మంచి కథకు కథానాయకుణ్ణి కావడం చాలా ఆనందంగా ఉంది’’ అని మనోజ్ చెప్పారు. భవిష్యత్తులో తనతో మరిన్ని మంచి సినిమాలు తీయాలనిపించేంత ఎనర్జిటిక్‌గా మనోజ్ నటించాడని లగడపాటి శ్రీధర్ అన్నారు. ఇంకా నాగచైతన్య, ఎం.ఎం.కీరవాణి, అల్లరి నరేష్, శర్వానంద్, చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.