
దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. రీఎంట్రీ ఇవ్వడానికి భయపడ్డారట. తనను ప్రేక్షకులు తిరిగి ఆదరిస్తారో లేదో అని సందేహపడ్డారట. ఓ సినిమా అవార్డు ఫంక్షన్‌లో మాట్లాడిన ఆయన, ఖైదీ 150 చిత్రానికి ముందు తనలో ఉన్న భయం గురించి అందరి ముందు చెప్పారు.
తన సినిమాలు చూసే వాళ్లు అందరూ ఇప్పుడు సినిమాలు తగ్గించేసి ఉంటారని, అలాంటి సమయంలో తాను రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇప్పటి యువతరాన్ని అలరించగలనా అనే భయం తనలో ఉండేదని, అందుకే ప్రయోగాత్మక చిత్రాలవైపు వెళ్లలేకపోయానన్నారు. ఆ కారణంగానే ఖైదీ నెంబర్ 150 రీమేక్ చేయాల్సి వచ్చిందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కానీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో 18-23 ఏళ్ల యువకులను చూసి తనలో ఉన్న భయం మొత్తం పోయిందన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'ఒక్కసారి ఆదరిస్తే చాలు, తరాలు మారినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే విషయం అప్పుడు అర్థమైంది. ఈ చిరుజీవిని చిరంజీవిగా మీ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్' అంటూ అభిమానులను ఉద్ధేశించి అన్నారు.