సెమీ సాలిడ్‌.. సెమీ లిక్విడ్‌.. మెర్క్యూరీ | Mercury Movie Review | Sakshi
Sakshi News home page

సెమీ సాలిడ్‌.. సెమీ లిక్విడ్‌.. మెర్క్యూరీ

Published Sat, Apr 14 2018 12:37 AM | Last Updated on Sat, Apr 14 2018 7:11 AM

Mercury Movie Review - Sakshi

మెర్క్యూరీ.. కార్పోరేట్‌ శక్తుల ఆశకు బలవుతున్న జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం చేసిన చిత్రం. తొలి మూకీ థ్రిల్లర్‌గా ట్యాగ్‌ వేసుకుంది. 1987లో సింగీతం శ్రీనివాసరావు తీసిన మూకీ చిత్రం.. లవ్, రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పుష్పక్‌’ (తెలుగులో ‘పుష్పక విమానం’)కు మించిన అంచనాలతో వచ్చింది.

కథ..
చెవిటి, మూగ అయిన అయిదుగురు స్నేహితులు (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) ఓ వారాంతం ఒక టీ ఎస్టేట్‌లో కలుసుకుంటారు. ఆ రోజే అమ్మాయి బర్త్‌డే ఉండడంతో బర్త్‌డే పార్టీ కూడా చేసుకుంటారు. ఈ కథలో ముందుకు వెళ్లాలంటే దీని మూలమైన చిన్న ఫ్లాష్‌బ్యాక్‌ తెలుసుకోవాలి. ఈ సినిమా నడిచే కాలానికి పదేళ్ల క్రితం.. తమిళనాడులోని ఒక ఊళ్లో కార్పోరేట్‌ ఎర్త్‌ అనే సంస్థ ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ పెడుతుంది.

అందులోని విషవాయువు లీక్‌ అయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని దాదాపు 80 మంది చనిపోతారు. ఇంకా చాలామంది దాని దుష్ప్రభావాలకు లోనవుతారు. ఈ అయిదుగురు స్నేహితులు కూడా ఆ బాధితులే. ఆ విషవాయువు వల్లే వీళ్లకు వినికిడి లోపం వస్తుంది. దానివల్ల మాట్లాడలేకుండా అవుతారు. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. టీ ఎస్టేట్‌లో పార్టీ చేసుకొని కార్పోరేట్‌ ఎర్త్‌ ఫ్యాక్టరీ వల్ల చనిపోయిన 80 మంది స్మారక చిహ్నం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారు.

ఆ దారిలోనే ఉన్న మూతబడ్డ ఆ ఫ్యాక్టరీ మీద రాళ్లు విసిరి తమ కోపాన్ని, బాధను, నిస్సహాయతనూ వెళ్లగక్కుతారు. అక్కడే ఓ కొండ మీద ఆ నలుగురులోని ఓ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల తనుకున్న ప్రేమను చెబుతాడు కానుకనిచ్చి. అమ్మాయీ ఆ ప్రేమను సమ్మతిస్తుంది. రాత్రయిపోతుంది.. తిరిగి టీ ఎస్టేట్‌లోని తామున్న బసకు బయలుదేరుతారు అయిదుగురు. అమ్మాయి డ్రైవ్‌ చేస్తుంటుంది. ఆమెను ప్రేమిస్తున్న అబ్బాయి పక్క సీట్లో.. మిగిలిన ముగ్గురూ వెనకాల కూర్చుంటారు.

ఆ అబ్బాయి తన ప్రేమికురాలిని ఆటపట్టించేందుకు హెడ్‌ లైట్లు ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తుంటాడు. ఈ ఆటకు వెనకాలున్న ఓ అబ్బాయీ జత కలుస్తాడు. అలా ఓ రెండుమూడు సార్లు ఆడుతుంటే అమ్మాయి ముద్దుగానే తన ప్రేమికుడిని విసుక్కుంటుంటుంది. నాలుగోసారీ అలాగే లైట్లు ఆఫ్‌ చేసి ఆన్‌ చేసేసరికి చీకట్లో దారి కనపడక బండి అదుపు తప్పుతుంది. అప్పుడే ఓ కుక్క దారికి అడ్డు వస్తుంది. అసలే కొండదారి.. రాత్రి.. వేగం.. భయపడ్డ ఆమె ప్రేమికుడు లైట్లు ఆన్‌చేసి కంట్రోల్‌ తప్పిన వెహికిల్‌ను కంట్రోల్‌లోకి  తెస్తాడు. సడెన్‌ బ్రేక్‌తో వెహికిల్‌ ఆగుతుంది. 

అంతా ఊపిరి పీల్చుకుంటారు. రోడ్డుకు కాస్త పక్కకు వెళ్లిన వెహికిల్‌ను రివర్స్‌గేర్‌తో సరిచేసి మళ్లీ స్టార్ట్‌ చేస్తుంది అమ్మాయి. కొంత దూరం వెళ్తుందో లేదో ఎవరో చైన్‌ వేసి లాగినట్టయి బండి  ఆగిపోతుంది. అందరూ దిగి చూస్తారు. నిజంగానే వెహికిల్‌ వెనక సైలెన్సర్‌కు ఓ గొలుసు కనపడుతుంది. భయంతో షాక్‌ అవుతారు వీళ్లు. ఆ చైన్‌ రెండో కొన పక్కనే ఉన్న పొదలోకి చొచ్చుకొని ఉంటుంది. ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి ధైర్యం చేసి చూస్తాడు. అక్కడ ఈ చైన్‌ రెండో కొనను చేయికి చుట్టుకొని రక్తం మడుగులో పడి ఉన్న ఒక వ్యక్తి (ప్రభుదేవా)కనపడ్తాడు. కళ్లు తేలేసి ఉంటాయి. మిగిలిన వాళ్లనూ పిలుస్తాడు ఆ అబ్బాయి.

అతనూ బాధితుడే..
ఆ అయిదుగురూ తమ వెహికిల్‌కున్న ఆ గొలుసును తీయడానికి ప్రయత్నిస్తారు. కాని రాదు. దాంతో ఆ వ్యక్తి చేతికున్న కొసను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లోపు ఆ దారిలోనే మరో వెహికిల్‌ వస్తున్న శబ్దం రావడంతో గబగబా ఆ శవాన్ని తీసి వెహికిల్‌ వెనక భాగంలో పెట్టేస్తారు. దారిలో ఓ జలపాతం దగ్గర బండి ఆపి.. శవాన్ని అందులో పడేయాలనుకుంటారు. కాని అక్కడ సర్వైలెన్స్‌ కెమెరా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసుకొని బండిని ముందుకు తీసుకెళ్తారు.

అంతకుముందు వాళ్లు రాళ్లేసిన మూతపడ్డ కార్పోరేట్‌ ఎర్త్‌ ఫ్యాక్టరీ గ్రౌండ్‌లో ఉన్న గొయ్యిలో శవాన్ని ఆకులు, తుప్పలు, కర్రలతో కప్పేస్తారు. కాటేజ్‌కు వెళ్లిపోతారు. అయితే ఈ క్రమంలో ఆ అయిదుగురిలో ఒక అబ్బాయి తన ఐపాడ్‌ను ఎక్కడో పారేసుకుంటాడు. అది వెతుక్కోవడానికి తెల్లవారి మళ్లీ ఈ గొయ్యి దగ్గరకు వచ్చి చూస్తారు. అక్కడ ఐపాడ్‌ దొరుకుతుంది కాని శవం ఉండదు. అలాగే ఆ అమ్మాయీ మాయం అవుతుంది. ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కోవడానికి ఫ్యాక్టరీకి వెళ్తారు. అక్కడే శవం కనపడుతుంది.

ఆ శవం ఈ అయిదుగురిలో ముగ్గురినీ చంపేస్తుంది. అలా చంపేటప్పుడు తెలుస్తుంది ఆ శవం గుడ్డిదని. చివరకు ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇద్దరే మిగులుతారు. ప్రేమికుడినీ చంపుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడుతుంది చంపొద్దని. అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తి తనకెంత ముఖ్యమైన వాడో.. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఎంత ఇష్టపడ్తున్నారో అని. తాము అయిదుగురూ చెవిటి, మూగ వాళ్లమని.

అప్పుడు ఆ శవానికీ తన గతం గుర్తొస్తుంది. ఆ అమ్మాయికి చెప్తుంది. ఆ శవమూ గతంలో ఆ ఫ్యాక్టరీలో లీక్‌ అయిన విషవాయువు బాధితుడే. అతనికి కళ్లు పోతాయి. తన ప్రేమికురాలు అతనికి కళ్ల ఆపరేషన్‌ చేయించడానికి ట్రై చేస్తుంటుంది. తెల్లవారితే ఆపరేషన్‌.. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టక పెంపుడు కుక్క సహాయంతో బయటకు వస్తాడు. వీళ్ల వెహికిల్‌తో యాక్సిడెంట్‌ అవుతుంది. వీళ్లు తమ వెహికిల్‌ను రివర్స్‌తీసుకున్నప్పుడు ప్రభుదేవాకు యాక్సిడెంట్‌ అవుతుంది.

అతను గుడ్డి వాడు కాబట్టి కనపడదు.. వీళ్లంతా చెవిటి వాళ్లు కాబట్టి అతని ఆర్తనాదం వీళ్లకు వినపడదు. అలా అందులో ఎవరి తప్పూ ఉండదు. అకారణంగా వాళ్లను శిక్షించినందుకు ప్రభుదేవా పశ్చాత్తాపపడ్తాడు. అంతలోకే ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లి తన ప్రేయసిని.. తన ప్రాంతాన్ని కళ్లతో చూడాలనుకుంటాడు. అమ్మాయి శరీరంలోకి అతని ఆత్మ ప్రవేశించి అన్నీ చూసుకొని... ఆస్వాదించి ఆ ఆత్మ వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఆ అమ్మాయికి వినికిడి శక్తిని ఇస్తుంది. గొంతూ వస్తుంది.


ఇదీ మెర్క్యూరీ కథ. corporate earth లోంచి  corpor తీసేసి ate earth అని ఎండ్‌ చేస్తాడు సినిమాను దర్శకుడు. ఈ సినిమా ద్వారా ఆయన చెప్పదల్చుకుంది కూడా అదే. ఈ భూమ్మీద మనుషులతోపాటు సమస్త జీవులకూ జీవించే హక్కు అంతే ఉంది. కాని హద్దులు మరిచిన కార్పోరేట్‌ శక్తులు తమ దురాశతో భూమిని మింగేస్తున్నాయి అని. ఈ సందేశం మూకీ థ్రిల్లర్‌ ద్వారా ప్రేక్షకులను చేరిందా? ఆ విషయాన్ని చెప్పడానికి ఇంత సీన్‌ క్రియేట్‌ చేయాలా? ప్రేక్షకులే నిర్ణయించాలి. మెర్క్యూరీ ప్రస్తుతం అన్ని థియేటర్స్‌లో ఆడుతోంది. ఆసక్తి ఉన్న వాళ్లు చూడొచ్చు. ఈ చిత్రదర్శకుడు.. కార్తిక్‌ సుబ్బరాజ్‌.. పిజ్జా ఫేమ్‌!
 

– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement