నభా నటేశ్, సుధీర్‌బాబు
‘గులేబకావళి కథ’ చిత్రంలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ వినిపించినా ఎన్టీఆర్, జమునలు గుర్తుకురాక మానరు. అంతలా పాపులర్ అయిన ఆ పాట పల్లవిని సుధీర్‌బాబు తాజా చిత్రానికి టైటిల్‌గా పెట్టారు. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందవటే’. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలోని ‘మౌనం మాటతోటి..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
అజనీష్ లోకనాథ్ స్వరపరచి పాడిన ఈ పాటకు శ్రీ మణి సాహిత్యం అందించగా, విజయ్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సుధీర్‌బాబుగారి బ్యానర్‌లో తొలి చిత్రానికి నేను దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయి వరుణ్.
Comments
Please login to add a commentAdd a comment