ఎంఎస్ నారాయణ ఇక లేరు
చికిత్స పొందుతూ కన్నుమూత
ఫిలిం చాంబర్‌లో పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
కేసీఆర్, చంద్రబాబు, జగన్ సహా పలువురు నేతల సంతాపం
నేడు ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు, రచయిత ఎం.ఎస్.నారాయణ (63) ఇక లేరు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9:45 గంటలకు కన్నుమూశారు. సంక్రాంతి సందర్భంగా స్వస్థలం భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. గుండెపోటు రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సినీప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఎం.ఎస్. నారాయణ భౌతికకాయాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటులు మురళీమోహన్, బాబూమోహన్, తనికెళ్ల భరణి, సుమన్, వెంకటేశ్, రాంచరణ్ తేజ్, అలీ, వేణుమాధవ్, నాగబాబు, ఎల్బీ శ్రీరాం, అనంత్ తదితరులు ఎం.ఎస్. నారాయణ భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎం.ఎస్. నారాయణ మృతిపట్ల దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
700 చిత్రాల్లో నవ్వులు...
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న జన్మించిన ఎం.ఎస్. నారాయణ ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ చిత్రం ద్వారా నటుడిగా సినీరంగప్రవేశం చేశారు. ఆయన ఇప్పటివరకు 700పైగా చిత్రాల్లో నటించారు. రుక్మిణి, పెదరాయుడు, ఒట్టేసి చెబుతున్నా, సొంతం, దిల్, దుబాయ్ శీను, శశిరేఖా పరిణయం, దూకుడు.. వంటి చిత్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తనయుడు విక్రమ్‌ను కథానాయకునిగా పరిచయం చేస్తూ, తొలి ప్రయత్నంగా ఆయన ‘కొడుకు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘భజంత్రీలు’ సినిమాని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ‘పటాస్’లో ఆయన చేసిన ‘సునామీ స్టార్ సుభాశ్’ పాత్ర ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భీమవరంలో విషాద ఛాయలు
ఎం.ఎస్. నారాయణ మృతితో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నిడమర్రులో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన నిడమర్రులో జన్మించినా.. సినీరంగానికి రాకముందు ఎక్కువ కాలం భీమవరంలోనే గడిపారు. భీమవరం ఏఆర్‌కేఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఎం.ఎస్. నారాయణ 1978 అక్టోబర్ 30న కేజీఆర్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 23 ఏళ్లపాటు అందులో పనిచేశారు. ఆయన పాఠం చెబుతుంటే.. ఇతర తరగతుల విద్యార్థులంతా ఆ తరగతికి వెళ్లి మరీ ఎమ్మెస్ పాఠాలను వినేవారు. హాస్యం జోడించి ఆయన పాఠాలు చెప్పే విధానం విద్యార్థుల్ని విశేషంగా ఆకర్షించేది. ఎం.ఎస్. నారాయణ విద్యార్థులతో నాటకాలు వేయించేవారు. ఆంధ్రా యూనివర్సిటీ స్థారుులో నిర్వహించిన నాటక పోటీల్లో ఆయన రచించి, దర్శకత్వం వహించిన ‘రెండు రెళ్లు ఆరు’ నాటకానికి 8 బహుమతులు వచ్చారుు. ‘ఉపాధ్యాయుడి స్థారుు నుంచి ఎం.ఎస్. నారాయణ స్వయం కృషితో లెక్చరర్, ఆ తరువాత సినీ రంగానికి వెళ్లారు. కథా రచరుుతగా స్థిరపడాలనుకున్న ఆయన ప్రతి శనివారం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి చెన్నై వెళ్లి సోమవారం తిరిగి వచ్చేవారు. అక్కడకు వెళ్లినప్పుడు ఉండటానికి రేలంగి నరసింహరావు ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అనుకోకుండా హాస్యనటుడిగా స్థిరపడ్డారు’ అని ఎం.ఎస్. నారాయణతో కలసి పనిచేసిన లెక్చరర్లు జి.హరిప్రసాద్, తాడి లక్ష్మణరావు, టీవీ రమణ, జేవీవీ నాగేశ్వరరావు చెప్పారు.