నా మనవడు భలే ముద్దుగా ఉంటాడు | My Grandson is Very cute, says Raveena Tandon | Sakshi

నా మనవడు భలే ముద్దుగా ఉంటాడు

Published Thu, Jan 16 2014 1:31 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నా మనవడు భలే ముద్దుగా ఉంటాడు - Sakshi

నా మనవడు భలే ముద్దుగా ఉంటాడు

‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ అంటూ ఇరవయ్యేళ్ల క్రితం తన డాన్స్‌తో ఆకట్టుకున్నారు రవీనా టాండన్. ఇప్పటికీ ఆమెను ‘మస్త్ గాళ్’ అంటుంటారు. ఆ పిలుపు విన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుందంటున్నారు రవీనా. గతంలో బంగారు బుల్లోడు, రధసారథి, ఆకాశ వీధిలో.. చిత్రాల్లో నటించిన రవీనా... దాదాపు పన్నెండేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. డా. మోహన్‌బాబు సరసన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో నటించారామె. శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఇక, చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించిన రవీనా టాండన్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలోకెళ్దాం..
 
 ఇంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేయడం ఎలా ఉంది?
 నాకు హైదరాబాద్ అంటే ఇష్టం. ఇక్కడ చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. అందుకే కొత్తగా అనిపించడంలేదు. కాకపోతే, మోహన్‌బాబుగారి సరసన మొదటిసారి నటించాను. అదే విశేషం. విష్ణు ఫోన్ చేసి  కథ, నా రోల్ గురించి చెప్పారు. నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందీ పాత్ర. సినిమా మొత్తం  కామెడీగా ఉంటుంది. సీన్స్ చేస్తున్నప్పుడు లొకేషన్‌లో నవ్వుకునేవాళ్లం. ఓ మంచి సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది.
 
 ఆ మధ్య ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏం చేశారు?
 నిజానికి పిల్లలు పుట్టడంవల్లే ఆ బ్రేక్ తీసుకున్నాను. ఆ ఐదేళ్లూ నా భర్త, పిల్లలతో హాయిగా గడిపాను. అవి నా జీవితంలో ‘గోల్డెన్ డేస్’. చెబితే నవ్వుతారు కానీ... ఆ గ్యాప్‌లో బరువు గురించి ఆలోచించకుండా నచ్చినవన్నీ తినేశా.
 
 మీ పిల్లల గురించి చెబుతారా?
 నాకో పాప, బాబు. పాప పేరు రషా, బాబు పేరు రణబీర్. ఇద్దరూ అల్లరిలో ఫస్ట్. అది భరించలేక ఓ సారి మా అమ్మకు ఫోన్ చేసి, ‘నా చిన్నప్పుడు నేను అల్లరి చేసినందుకు సారీ అమ్మా. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోంది’ అన్నాను.
 
బాబుని, పాపను సమానంగా పెంచుతారా?
ఈ విషయంలో నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే, వాళ్లు  నన్ను, నా బ్రదర్‌ని సమానంగా పెంచారు. ఇంకా చెప్పాలంటే, నాకో మెట్టు ఎక్కువే ఇచ్చారు. ఇప్పుడు నా పిల్లలకూ అంతే.  ఆడ, మగ అంటాం కానీ, ఇద్దరిలో ఉండేది ఆత్మే. ఆ దేవుడు ఇచ్చిన ఆత్మని మనం గౌరవించాలి. ఆత్మకి లింగభేదం లేదు. బాహ్య శరీరంలో తేడా ఉండొచ్చు కానీ, లోపల ఉండే ఆత్మకు రూపం లేదనే విషయాన్ని గ్రహించాలి. 
 
గతంలో ఇద్దరు బిడ్డలను మీరు దత్తత తీసుకున్నారు కదా.. అవును. పూజా, ఛాయాలను దత్తత తీసుకోవడానికి ఓ కారణం ఉంది. వాళ్లు మా దూరపు బంధువులు. నా కళ్ల ముందే పెరిగారు. వాళ్ల అమ్మ చనిపోయింది. నాన్న తాగుబోతు. పిల్లలిద్దరూ దయనీయ స్థితిలో ఉండటం చూసి బాధ అనిపించింది. నేను, అమ్మా.. అనాథ శరణాలయాలకు సహాయం చేస్తుంటాం. అలాంటిది మా కళ్ల ముందే మా కుటుంబానికి చెందిన అమ్మాయిలు కష్టపడుతుంటే, చూస్తూ ఊరుకోలేకపోయాను. దాంతో దత్తత తీసుకున్నాను. అప్పుడు నా వయసు 21 ఏళ్లే. ఈ ఇద్దర్నీ నా కన్న పిల్లల్లా పెంచడంవల్లనో ఏమో! నా పిల్లల్ని పెంచడానికి ఓ మంచి అనుభవం వచ్చింది.  ఆ మధ్యే నా దత్త పుత్రికకు ఓ విదేశీయుడితో పెళ్లయ్యింది. వాళ్లకి బాబు పుట్టాడు. నీలి కళ్లు, రాగి జుత్తుతో చాలా ముద్దుగా ఉంటాడు. వాళ్లు సౌతాఫ్రికాలో ఉం టారు. ఈ మధ్య ముంబయ్ వచ్చారు. నా మనవడు నన్ను ‘నానా’ అని పిలుస్తుంటే, భలే అనిపించింది. 
 
ఆడపిల్లల తల్లి అవ్వడం వల్లనేనా.. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి ట్విట్టర్‌లో ఘాటుగా స్పందిస్తుంటారు? మీ మాటల్లో ఫైర్ కనిపిస్తుంటుంది.
 
ఇతర దేశాలతో పోల్చితే, ఎక్కువమంది దేవతలు ఉన్నది మన దేశంలోనే. ఆడవాళ్లను దేవతల్లా భావించాలంటారు. కానీ, ఆడవాళ్లపైనే దారుణాలు జరుగుతున్నాయి. చిత్రం ఏంటంటే.. దారుణాలు చేస్తున్న మగవాళ్లకు కొంతమంది ఆడవాళ్లు సహకరిస్తున్నారు. అందుకే బాధగా ఉంది. ఓ అమ్మాయిని స్వయంగా కన్నత ల్లే అమ్మిన సంఘటన ఇటీవల ఓ పల్లెటూరిలో జరిగింది. సాంకేతికంగా దేశం అభివృద్ధి  చెందిందేమో కానీ, ఆడవాళ్ల విషయంలో మాత్రం కాదు. ముగ్గురు ఆడపిల్లల తల్లిగా ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను సహించలేను. అందుకే, ట్విట్టర్ ద్వారా నా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాను.
 
ఈ దారుణాలు ఎలా ఆగుతాయంటారు?
చట్టంలో మార్పులు రావాలి. నిర్భయ కేసులోని నిందితుల్లో  బాల నేరస్తుడికి శిక్ష ఖరారు చేయలేదు. చిన్న వయసులో పెద్ద తప్పు చేయడం తెలిసిన వాడికి శిక్ష విధించడం అన్యాయం ఎలా అవుతుంది? పెద్దయిన తర్వాత వాడు పెద్ద పెద్ద దారుణాలకు ఒడిగట్టడని ఎలా చెప్పగలం? చైనా, సౌదీ అరేబియా, యుఎఇ, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లోనేర తీవ్రతను బట్టి పధ్నాలుగేళ్లు, పదహారేళ్లవాళ్లకైనా శిక్ష ఉంటుంది కానీ, వయసుని బట్టి కాదు. మరి.. మన దేశంలో మాత్రం ఎందుకు? తప్పు చేయడానికి వయసు అడ్డం రానప్పుడు శిక్షకు మాత్రం పద్ధెనిమిదేళ్లు ఉండాలనే రూల్ ఎందుకు? ఎప్పుడో 60 ఏళ్ల క్రితం రాజ్యాంగంలో రాసిన చట్టాలను ఇప్పుడు ఫాలో అయితే ఎలా? ఇప్పటికైనా మేల్కోవాలి. చట్టపరంగా సవరింపులు చేయాలి. 
 
మీది ప్రేమ వివాహం కదా.. మీ లవ్‌స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది?
మా నాన్నగారిలా సింపుల్‌గా, నిజాయితీగా ఉండే వ్యక్తిని పెళ్లాడాలనుకున్నాను. నా అదృష్టం బాగుండి నాన్న లక్షణాలన్నీ తడానీకి ఉన్నాయి. పైగా ధనవంతుడు కూడా (నవ్వుతూ). తొలిసారి తడానీని కలిసినప్పుడు, ‘ఎంత హుందాగా ఉన్నాడు’ అనుకున్నాను. తన ప్రవర్తన కూడా హుందాగా ఉండటంతో తెగ నచ్చేశాడు. ఆయనక్కూడా నేను నచ్చడంతో జీవితాన్ని పంచుకున్నాం.  
 
మీలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు?
తడానీనే. అది కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా. అక్టోబర్ 26న నా పుట్టినరోజు. ఆ రోజు దీపావళి కూడా. మా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో తడానీ ఆయన కుటుంబం కూడా పాల్గొన్నారు. దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో మా నాన్నగారు, ఆయన ఏదో సైగలు చేసుకోవడం చూశాను. నాకేం అర్థం కాలేదు. హారతి పూర్తయిన తర్వాత మా అమ్మానాన్న, వాళ్ల అమ్మానాన్న సమక్షంలో మోకాళ్ల మీద కూర్చుని, నాకు ప్రపోజ్ చేశారు. అప్పుడు ఆనందం, బిడియం.. ఇలా ఎన్నో ఫీలింగ్స్.
 
మీ నాన్నగారు రవి టాండన్ ముకద్దర్, వక్త్ కీ దీవాన్, జవాబ్.. తదితర చిత్రాలకు డెరైక్షన్ చేశారు. మరి మీరెప్పుడూ డెరైక్షన్ చేస్తారు?
సుభాష్ ఘయ్ ఓ సినిమాకి డెరైక్షన్ చేయమన్నారు. ఆ తర్వాత కొన్ని పెద్ద బేనర్ల నుంచి కూడా అవకాశాలొచ్చాయి. కానీ, కుదరదన్నా. ఎందుకంటే, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. యాక్టింగ్, డెరైక్షన్ అంటూ నేను బిజీగా ఉంటే వాళ్ల ఆలనా పాలనా ఎవరు చూస్తారు? పిల్లలు కాస్త పెద్దయ్యాక డెరైక్షన్ గురించి ఆలోచిస్తా.
 
మోహన్‌బాబుగారు మంచి చెబితే తప్పా?
మోహన్‌బాబుగారు పక్కా ప్రొఫెషనల్. వృత్తిని గౌరవించాలంటారు. అందరూ అలానే ఉండాలని కోరుకుంటారు, కానీ, కొంతమంది వల్ల అలా  ఉండటానికి కుదరదు. అలాంటివాళ్లని చూస్తే ఆయనకు కోపం. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినదాన్ని కాబట్టి, ఓ సినిమా నిర్మాణం ఎంత కష్టమో నాకు తెలుసు. కరెక్ట్ టైమ్‌కి లొకేషన్‌కి రావాలని మోహన్‌బాబుగారు రూల్ పెడితే తప్పేంటి? ఆయన కళ్లెదుట సినిమాని తేలికగా తీసుకుంటే భరించలేరు. తేలికగా తీసుకునేవాళ్లని వదలరు. అది తప్పేం కాదు. నా వరకు నేను ‘మోహన్‌బాబుగారి తీరు సుపర్బ్’ అంటాను.
 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement