బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మళ్ళీ షూటింగ్‌కు హాజరవుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారుడు అయాన్‌కు టొరంటోలో చికిత్స చేయించిన ఇమ్రాన్ ముంబైకి తిరిగొచ్చి,
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మళ్ళీ షూటింగ్‌కు హాజరవుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారుడు అయాన్‌కు టొరంటోలో చికిత్స చేయించిన ఇమ్రాన్ ముంబైకి తిరిగొచ్చి, క్రైమ్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘మా అబ్బాయి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. త్వరగా కోలుకున్నాడు. ట్యూమర్‌కు ముంబైలో ఆపరేషన్ చేయించినప్పుడు కానీ, తాజాగా టొరంటోలో కెమోథెరపీ చేసినప్పుడు కానీ మా వాడు ఉత్సాహంగానే ఉన్నాడు. ఆపరేషన్ అయిన రెండో రోజు నుంచే ఆసుపత్రిలో ఉత్సాహంగా పరిగెత్తాడంటే నమ్మండి’’ అని పిల్లాడి కబుర్లను పంచుకున్నారు ఇమ్రాన్.
చిన్నపిల్లల్లో లుకేమియా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది. కానీ, ఇమ్రాన్ హష్మీ కుమారుడికి ‘విల్మ్స్’ అనే అరుదైన క్యాన్సర్ వచ్చింది. ‘‘క్యాన్సర్ అనగానే పెద్దవాళ్ళం భయపడిపోతుంటాం. కానీ, ముందుగా కనిపెడితే క్యాన్సర్లలో నూటికి తొంభై అయిదు చికిత్సకు లొంగేవే. పైగా, మనకన్నా పిల్లలే చాలా దృఢంగా, ధైర్యంగా ఉంటారు. వారికి మనం అండగా నిలబడాలి. అంతే’’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. రెండేళ్ళ వయసు నుంచి అయన్‌కు బ్యాట్‌మన్ అంటే మహా ఇష్టం. పాలు తాగడం దగ్గర నుంచి ఏది చేయాలన్నా బ్యాట్‌మన్ పేరు చెప్పి, ఇమ్రాన్ దంపతులు పని చేయించేవారట. ఇప్పుడు చికిత్స సమయంలోనూ ఇమ్రాన్ ఆ టెక్నిక్కే వాడినట్లుచెప్పారు. క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చిన పిల్లలతో తల్లితండ్రులు ఎలా ఉండాలన్న దానికి ఇమ్రాన్ ప్రవర్తన ఓ ఉదాహరణ కదూ.