సరస్వతి టీచర్ అభ్యంతరం చెప్పలేదు: వర్మ
హైదరాబాద్ : 'సావిత్రి' సినిమాపై ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. సాక్షి టీవీ చానల్లో 'సావిత్రి' సినిమాపై జరిగిన చర్చపై ఆయన ఫోన్లో మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికీ 'క్రష్' ఉంటుందని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పానని టీచర్ సరస్వతి తనను అభినందించారన్నారు. సావిత్రి సినిమాపై సరస్వతి టీచర్ అభ్యంతరం తెలపలేదని వర్మ అన్నారు. తనకున్న భావాలను సినిమా ద్వారా చెప్పే వాక్ స్వాతంత్ర్యం తనకుందని, నచ్చకపోతే చూడటం, చూడకపోవటం ఎదుటవారి ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
తన జీవితంలో అలాంటి ఘటన జరిగిందని, అదే విషయాన్ని ఎవరి జీవితంలో అయినా జరిగితే చెప్పమన్నానని, లేకుంటే చెప్పాల్సిన అవసరం లేదని వర్మ ముక్తాయించారు. ఇక దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదని వర్మ ఖరాఖండిగా చెప్పారు. న్యాయపరమైన అంశాలు తనకు తెలియవని, తాను చెప్పదలచుకున్నది ప్రెస్నోట్లోనే చెప్పానంటూ ఫోన్ కట్ చేశారు. మరోవైపు వర్మ 'సావిత్రి' చిత్రంపై మహిళా సంఘాలతో పాటు, బాలలహక్కుల కమిషన్, పలువురు ఉపాధ్యాయులు అభ్యంతరం చెబుతున్నారు. వర్మకు మానసిక స్థితి సరిగా లేదంటూ మహిళా సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.