ధనుష్, నయనతార ప్రత్యేక పాటతో నా లవ్‌స్టోరీ మొదలైంది
ధనుష్, నయనతార ప్రత్యేక పాటతో నా లవ్‌స్టోరీ మొదలైంది
Published Sun, Jan 26 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ హీరో ధనుష్ నిర్మించిన చిత్రం ‘ఎదిర్ నీచల్’. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, నయనతార ఓ ప్రత్యేక పాట చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ’కొలవెరి..’ ఫేం అనిరుథ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.రామానాయుడు సీడీని ఆవిష్కరించి గోపిచంద్‌కి ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాత తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని రామానాయుడు ఆకాంక్షించారు.
తమిళంలో విజయం సాధించిన చిత్రమిదని, పాటలు బాగుంటాయని గోపిచంద్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్, సందీప్ కిషన్, నారా రోహిత్, ప్రిన్స్, సురేష్ కొండేటి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమిళంలో లానే... తెలుగులో కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని శివకార్తికేయన్ అన్నారు. జీవితంలో ఆశావహ దృక్పథంతో ఉంటే అన్నీ సాధించగలుగుతామనే కథాంశంతో ఈ చిత్రం చేశామని దర్శకుడు తెలిపారు. ‘‘ముందుగా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టి, నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాను’’ అని నిర్మాత చెప్పారు. పాటలతో పాటు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని అనిరుథ్ కోరారు.
Advertisement
Advertisement