కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది 'సార్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు అదే జోష్‌ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన 'కెప్టెన్ మిల్లర్'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది.
(ఇదీ చదవండి: భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్)
ధనుష్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో తెలుగు స్ట్రైట్ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలు అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది.
దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్ సినిమా విడదల విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్‍ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్‌లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్‍కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment