ఎవరు ఎవరిని ఛేజ్ చేస్తారు?
అది ప్యారిస్ నగరం... చాలా అందంగా ఉంటుంది. రోడ్లన్నీ చాలా విశాలంగా ఉంటాయి. ఆ విశాలమైన రహదారుల్లో ఏదైనా కారును ఛేజ్ చేయాల్సి వస్తే? వేగాన్ని లెక్క చేయకుండా వాహనాన్ని దౌడు తీయించొచ్చు. త్వరలో నాగార్జున, కార్తి అదే చేయనున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఎవరినైనా ఛేజ్ చేస్తారా? లేక వీళ్లే ఒకర్నొకరు వెంటాడతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నాగ్, కార్తి, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసమే ఛేజింగ్ సీన్ చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్, చెన్నయ్‌లలో భారీ షెడ్యూల్స్ చేశారు.
ఈ నెల 7న ఈ చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది. ఆ విశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ఈ నెల 7 నుంచి యూరప్‌లో షూటింగ్ మొదలుపెడతాం. సౌత్ ఈస్ట్ యూరప్‌లో పెద్ద నగరమైన బెల్‌గ్రేడ్‌లో ఇప్పటివరకూ ఏ దక్షిణాది సినిమా షూటింగ్ చేయలేదు. ఆ ఘనత ఈ చిత్రానికే దక్కుతుంది. బెల్‌గ్రేడ్ తర్వాత ప్యారిస్, లియాన్‌లలో షూటింగ్ చేస్తాం. స్లొవేనియా రాజధాని జబ్లిజనాలో కూడా కొంత భాగం చిత్రీకరిస్తాం. యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశాం. ఈ చిత్రానికి గోపీసుందర్ మంచి స్వరాలు కూర్చారు’’ అని చెప్పారు.