Jersey Movie Review, in Telugu | ‘జెర్సీ’ మూవీ రివ్యూ | Nani, Gowtham Tinnanuri - Sakshi
Sakshi News home page

‘జెర్సీ’ మూవీ రివ్యూ

Published Fri, Apr 19 2019 12:56 PM | Last Updated on Sat, Apr 20 2019 7:39 AM

Nani Jersey Telugu Movie Review - Sakshi

టైటిల్ : జెర్సీ
జానర్ : ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా
తారాగణం : నాని, శ్రద్దా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ తదితరులు
సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌
దర్శకత్వం : గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దేవదాస్‌, కృష్ణార్జున యుద్దం లాంటి కమర్షియల్‌ సినిమాలను చేసి భంగపడ్డ నాని.. అసలు విషయం తెలుసుకుని మళ్లీ తన పంథాలోకి వచ్చేశాడు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు జెర్సీతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా నాని ఆశించిన విజయాన్ని అందించిందా? సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన మ్యాజిక్‌ను ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారా లేదో ఓ సారి చూద్దాం..

కథ
అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని​ కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌(క్రికెట్‌ లైఫ్‌) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌..  ఓ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్‌ అయి నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ ఉంటాడు. అర్జున్‌, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్‌ ఉద్యోగం కూడా పోతుంది.

క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేకపోతాడు. ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటాడు. అసలు అర్జున్‌  క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ కథ.

నటీనటులు
అర్జున్‌ పాత్రలో నానిని తప్పా మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేకుండా.. ఆ పాత్రలో జీవించేశాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ, నార్మల్‌ ఫ్యామిలీ పర్సన్‌గానూ నటించి మెప్పించాడు. రియల్‌ లైఫ్‌లో నాన్నగా  మారినా నాని.. రీల్‌ లైఫ్‌లోనూ ఆ ఫీలింగ్‌ను క్యారీ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ మంచి మార్కులు కొట్టేసింది. ప్రేయసిగానూ, భార్యగానూ రెండు పాత్రల్లో శ్రద్దా సహజంగా నటించింది. లుక్స్‌పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కోచ్‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. 

విశ్లేషణ
మనిషి కష్టాలు పడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్‌ అవ్వడం.. ఈ కాన్సెప్ట్‌ వెండితెరకు మామూలే. అయితే స్క్రీన్‌పై ఆ కథలనే ఏవిధంగా ఆవిష్కరించామన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. జెర్సీ లాంటి కథలు మనం ఈపాటికే ఎన్నింటినో చూసి ఉంటాము. కానీ ఈ కథకు క్రికెట్‌ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్‌ తిన్ననూరి తన టాలెంట్‌తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి. డెబ్బై రోజుల నాని కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా నాని తనను తాను మలచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు.

గౌతమ్‌ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్‌ కాస్త లెంగ్తీ గానూ, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది. ఇక నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సెకండాఫ్‌లో వేగం పెంచినా.. పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగింది. అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.

నాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగగా.. చివర్లో వచ్చే ట్విస్ట్ షాకింగ్‌గా అనిపిస్తుంది. అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అవ్వగా.. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమా మొత్తం 1986, 96 నేపథ్యంలోనే జరగ్గా.. అప్పటి వాతావరణాన్ని సినిమాటోగ్రఫర్‌ చక్కగా చూపించారు. పీరియాడిక్‌ నేపథ్యంలో సాగినా ఈ సినిమాకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం కూడా తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
నాని
కథా కథనం
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
నిడివి 
హై ఎమోషన్స్‌
స్లో నెరేషన్‌

బండ కళ్యాణ్‌, ఇంటర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement