నయన్ పారితోషికం రూ.7 కోట్లా?
ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదు. చిత్రాలకు వసూళ్లు లేవు. థియేటర్లు మూసు కోవలసిన పరిస్థితి. మరో పక్క చిత్రాలు కొనుగోలు చేయడానికి బయ్యర్లు రావడం లేదు. వ్యాపారం జరగడం లేదు. 400 వందలకు పైగా చిత్రాలు సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోక మగ్గుతున్నాయి. చిత్ర పరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో పడింది. ఇవీ పరిశ్రమ పెద్దలు వాపోతున్న మాటలు. ఇదిలా ఉంటే ఇక తారల విషయానికి వస్తే పారితోషికాలను సినిమా, సినిమాకు పెంచుకు పోతున్నారన్నది నిజం. నటి నయనతార విషయానికే వస్తే కోలీవుడ్‌లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన తన కెరీర్ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఏంటి అప్పుడే ఆశ్చర్య పోతున్నారా? ఈ మొత్తం హీరోల సరసన నటించడానికేనట.
నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే. ఇలాంటి చిత్రాలకు ఆ జాన పారితోషికం డిమాండ్ చేస్తున్నదెంతో తెలుసా? అక్షరాలా ఏడు కోట్లట. ఇది ఏ దక్షిణాది తార పొందనటు వంటి మొత్తం అని వేరే చెప్పాలా’ అయితే ఇది టూమచ్ అంటున్నారు సినీ వర్గాలు. నయనతార చిత్రాలు లాభాలు గడిస్తున్నాయి అందుకే అంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే వారూ లేక పోలేదు.