
చెన్నై : సంచలన నటి, అగ్రకథానాయకి, లేడీసూపర్‌స్టార్ ఇలా చాలా పేర్లకు సొంతదారి నయనతార. ఎక్కడో కేరళలోని ఒక మారు మూలగ్రామంలో డయానా కురియన్‌గా పుట్టి ఆ తరువాత మాతృభాషలో నటిగా పరిచయమై, ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమకు ‘అయ్యా’ చిత్రంతో రంగప్రవేశం చేసి, ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలోనే అగ్రకథానాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార. ఈ స్థాయికి చేరుకుంటానని తనే ఊహించి ఉండదు. అయితే తన ఈ వెలుగు వెనుక పడిన వెతలెన్నో ఉన్నాయని చాలా మందికి తెలుసు. నటిగా ఎన్నో ఒడిదుడుకులు చవిచూసింది. వ్యక్తిగతంగానూ చాలాసార్లు నమ్మి మోసపోయింది. ఆత్మస్థైర్యంతో వాటినన్నింటినీ ఎదురొడ్డి నిలబడి ఎందరో అబలలకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రేమలో పలుమార్లు మోసపోయిన నయనతారకు యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్ తోడుగా నిలిచారు. ప్రేమ, పెళ్లి విషయాలను పక్కన పెడితే విఘ్నేశ్‌శివన్, నయనతార ఒకరిని ఒకరు నమ్మారు. ఆ నమ్మకమే నయనతారను మూడోకన్ను తెరిచేలా చేసింది.
ఈ మూడో కన్ను సంగతేంటంటారా? నయనతార తాజాగా నటిస్తున్న చిత్రం పేరు నెట్రికన్. నెట్రికన్ అంటే మూడోకన్ను అని అర్థం. నయనతార నటిస్తున్న చిత్రం పేరు నెట్రికన్ ఇందులో ప్రత్యేకత ఏముందీ? తన చేస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి అని అనుకుంటున్నారా? మీరలా అనుకోవడంలో తప్పేలేదు. విషయం ఏమిటంటే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. దీనికి నయనతార హీరోయిన్ అయితే, ఆయన ప్రియుడు విఘ్నేశ్‌శివన్ నిర్మాత. ఈ చిత్ర నిర్మాణ సంస్థకు ఈ సంచలన జంట పెట్టిన పేరు రౌడీ పిక్చర్స్. ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే కదా? రౌడీ పిక్చర్స్ పేరు వెనుక కారణం ఉంది. విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం నానుమ్ రౌడీదాన్. ఇందులో నయనతార కథానాయకి. అందులో నయనతార చెవిటి యువతిగా నటించింది. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా విజయవంతమైంది. అంతే కాదు ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే నయనతారకు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ల పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. అలా మొదలైన ప్రేమ ఇప్పుడు వారి సహజీవనానికి దారి తీసింది. త్వరలో పెళ్లికీ దారి తీస్తుందని చెప్పవచ్చు. ఆ జ్ఞాపకార్థమే తమ చిత్ర నిర్మాణ సంస్థకు రౌడీ పిక్చర్స్ అని పేరు నిర్ణయించుకుని ఉంటారని భావించవచ్చు. ఇంక ఇందులోనూ నయనతార అంధురాలిగా హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలో నటిస్తోంది. దీనికి మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు సిద్ధార్థ్ నిర్మాతగా మారి హీరోగా నటించిన అవళ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారన్నది గమనార్హం. ఆ చిత్రం హిట్. ఇప్పుడు నయనతార తన ప్రియుడిని నిర్మాతగా చేసి నిర్మించి నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను సైలెంట్‌గా ఆదివారం ప్రారంభించారు. అంతే కాదు నెట్రికన్ టైటిల్‌ను విడుదల చేశారు. ఇదీ హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగానే ఉంటుందట.
సూపర్‌స్టార్‌కు ధన్యవాదాలు
మధ్యలో సూపర్‌స్టార్ గొడవేంటీ అని అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కనెక్షన్ ఉంది. నెట్రికన్ టైటిల్‌తో రజనీకాంత్ 1981లోనే సూపర్‌హిట్ చిత్రం చేశారు. కమితాలయ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌పీ. ముత్తురామన్ దర్శకుడు. ఈ టైటిల్ హక్కులను ఆ సంస్థ నుంచి నయనతార వర్గం అధికారికంగా పొందిందట. దీంతో నెట్రికన్ చిత్ర టైటిల్ విడుదలతో పాటు కమితాలయ సంస్థకు, నటుడు రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment