అక్కడికెళితే టెన్షన్... ఇంట్లో ఉంటే రిలాక్సేషన్!
అగ్రతారలందరూ సినిమాలు చేయడంతో పాటు ఏదో ఒక ఉత్పత్తికి ప్రచారకర్తగా చేస్తూ, తమ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటారు. కొంతమంది చేతిలో నాలుగైదు ఉత్పత్తులు కూడా ఉంటాయి. వాటితో పాటు నగలు, చీరల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి వెళ్లి బాగానే బ్యాంక్ బాలెన్స్ పెంచుకుంటారు. కానీ, నయనతార ఇందుకు పూర్తి భిన్నం. అప్పుడెప్పుడో ఓ చీరల దుకాణానికి ప్రచారకర్తగా చేశారు. అది మినహ ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం కానీ, షాప్ ఓపెనింగ్స్‌కి కానీ వెళ్లిన దాఖలాలు లేవు.
దానికి కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార చెబుతూ - ‘‘షాప్ ఓపెనింగ్స్ ఒప్పుకున్నామనుకోండి... మేం వెళ్లిన తర్వాత తీరిగ్గా పూజా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఆనక... ఓ నాలుగైదు రకాల చీరలిచ్చి.. ఒకదాని తర్వాత ఒకటి మార్చుకోమంటారు. ఆ చీరల్లో మేం ఫొటోలకు పోజులివ్వాలి. వాటితో పెద్ద పెద్ద హోర్డింగులు తయారు చేయించి, ప్రధాన కూడళ్లలో పెడతారు. అవి ఏడాది పాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటాయి. ఇక.. సెలబ్రిటీలు వస్తున్నారని ముందే ప్రకటిస్తారు కాబట్టి, విపరీతమైన జనాల తాకిడి. ఫలితంగా ఒకటే టెన్షన్. అక్కడికెళ్లి టెన్షన్ పడే బదులు.. ఆ సమయంలో ఎంచక్కా ఇంటి పట్టున ఉండి రిలాక్స్ అయిపోవచ్చు కదా’’ అన్నారు.