హాలీవుడ్లో మరో భారతీయ నటుడు
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. విలక్షణ నటులు, టాప్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు మాత్రమే సాధించగలిగే హాలీవుడ్ ఆఫర్ను అందుకున్నాడు నీల్. ప్రస్తుతం సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' షూటింగ్ పూర్తి చేసిన నీల్ త్వరలో హాలీవుడ్ టివి సీరీస్ షూటింగ్లో పాల్గొననున్నాడు.
హెచ్బివో ఛానల్లో ప్రసారం అవుతున్న 'గేమ్ ఆఫ్ త్రోన్స్' టివి సీరీస్ కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ను సంప్రదించారు. 'గేమ్ ఆఫ్ త్రోన్స్'ను డైరెక్ట్ చేస్తున్న జార్జ్ పోవెల్, 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా కోసం రెండు కత్తి యుద్ధాలను డైరెక్ట్ చేశాడు. ఈ సన్నివేశాల కోసం నీల్నితిన్కు నెల రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ సమయంలోనే నీల్ వర్కింగ్ స్టైల్ నచ్చిన డైరెక్టర్ జార్జ్, తన టివి సీరీస్లో ఆఫర్ ఇచ్చాడు.
'ప్రేమ్ రథన్ ధన్ పాయో' సినిమాలో భారతీయ రాజకుటుంబానికి చెందిన యువకుడిగా నటిస్తున్నాడు నీల్ నితిన్ ముఖేష్. రాజశ్రీ ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈసినిమాకు సూరజ్ బర్జాత్యా దర్శకుడు. సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.