ఆ సినిమాకూ మూడు కత్తెరలు పడ్డాయి!
బాలీవుడ్‌లోనే క్లీన్ సినిమాలు తీసే దర్శకుడు సూరజ్ బర్జాత్యా. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఆయన తాజాగా తీసిన సినిమా 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'. సల్మాన్‌ఖాన్, సోనంకపూర్ జంటగా నటించిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టడం విస్మయం కలిగిస్తున్నది. తెలుగులో 'ప్రేమలీల'గా వస్తున్న ఈ సినిమాకు మూడు కత్తెరలు వేసిన తర్వాత సెన్సార్ బోర్డు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది.
గతవారం సినిమాను చూసిన పరిశీలన కమిటీ.. చిత్రంలో రఖైల్ (ఉంపుడుగత్తె) అనే పదాన్ని వాడటంతో పాటు మరో రెండు సీన్లకు కట్ వేయాలని సూచించిందని, ఇందుకు చిత్రబృందం కూడా అంగీకరించిందని చిత్రయూనిట్‌కు సంబంధించిన విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా రామ్-లీల స్వీకెన్స్‌లో పాత పాటలకు వృద్ధ దంపతులు డ్యాన్స్ చేసే సన్నివేశానికి కత్తెర వేసింది. ఒక వ్యక్తి ఉరి వేసుకునే సన్నివేశాన్ని లాంగ్ షాట్‌లో చూపించాల్సిందిగా సెన్సార్ కోరింది. ఇందుకు చిత్రబృందం అంగీకరించిందని సినీవర్గాలు తెలిపాయి. సెన్సార్ బోర్డు సినిమాలోని కొన్ని సీన్లకు అభ్యంతరం చెప్పడంపై చిత్రబృందం షాక్‌కు గురయింది.
'సూరజ్ బర్జాత్యా అత్యంత స్వచ్ఛంగా సినిమాలు తెరకెక్కిస్తారు. నిజానికి ప్రేమ్‌రతన్ ధన్‌పాయోలో కూడా ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవు. అయినా బర్జాత్యా సినిమాలకు సంబంధించి తొలసారి సెన్సార్ అభ్యంతరాలు రావడం మమ్మల్ని షాక్‌కు గురిచేస్తున్నది' అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు తీరును ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శకులు తప్పుబట్టారు. ప్రముఖ దర్శకులు మహేశ్ భట్, శ్యాం బెనెగల్, సుభాష్ కపూర్, నీరజ్ ఘ్యావన్ సెన్సార్ బోర్డు తీరు మూర్ఖంగా ఉందని అభిప్రాయపడ్డారు.