టార్గెట్... సీయం కుర్చీ!
అతను అల్లూరి సీతారామరాజు కాదు... సుభాష్ చంద్రబోస్ కాదు... భగత్‌సింగ్ కూడా కాదు! కానీ, టీవీల్లో ముప్ఫై ఏళ్ల ఆ యువకుడి జీవితం గురించి తెగ చెప్పేస్తున్నారు. అతని పేరు... జోగేంద్ర. అతని టార్గెట్... సీయం కుర్చీ! అతని బలం... ‘వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేనూ అవుతా సీయం’ అంటూ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరేంత! మరి, అనుకున్న టైమ్‌లో అతను టార్గెట్ రీచ్ అయ్యాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘నేనే రాజు నేనే మంత్రి’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు తేజ.
ఆయన దర్శకత్వంలో రానా హీరోగా డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మించిన చిత్రమిది. కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసాలు హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ శనివారంతో పూర్తయింది. ‘‘నటుడిగా రానాలో కొత్త కోణాన్ని చూస్తారు. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సినిమాలో రానా యాటిట్యూడ్ ఉంటుంది’’ అన్నారు తేజ. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ను 40 లక్షలమంది నెటిజన్లు చూశారు.
ప్రేక్షకుల స్పందన చూస్తోంటే మా నమ్మకం బలపడుతోంది. రానా కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: నారాయణరెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్–లక్ష్మీ భూపాల్–సురేంద్ర కృష్ణ, ఫైట్స్: రవివర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల, సమర్పణ: డి. రామానాయుడు.