జోలీ భయపెడుతుందా?
జోలీ భయపెడుతుందా?
Published Tue, Apr 15 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీని అక్కడి నిర్మాతలు, పంపిణీదారులు ముద్దుగా ‘బంగారు బాతు’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే, ఆమె నటించిన చిత్రాల్లో లాభాలు తెచ్చిపెట్టినవే ఎక్కువ. కానీ, ఇప్పుడే ద గోల్డెన్ స్టార్ చేసిన ‘మేల్‌ఫిసెంట్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చని పంపిణీదారులు సందేహిస్తున్నారట. ఇందులో ఏంజెలినా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారు. తన పాత్ర పేరు మేల్‌ఫిసెంట్. స్వతహాగా మంచితనానికి చిరునామా అయిన మేల్‌ఫిషెంట్ మోసానికి గురవుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. పలు రకాల మోసాలకు గురైన తర్వాత ఆమె మనసు బండరాయి అవుతుందని. దాంతో విలన్‌గా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
మామూలుగా అన్ని సినిమాల్లోనూ అందంగా కనిపించే ఏంజెలినా ఈ చిత్రంలో మాత్రం తలకు కొమ్ములు, విరబోసిన జుత్తు, కళ్లకు లెన్స్... ఇలా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. మొత్తానికి ఈ లుక్ పిల్లలను భయపెడుతుందని చెప్పొచ్చు. కానీ, ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్న వాల్ట్ డిస్నీ అధినేతలు కూడా భయపడుతున్నారట. దేవకన్యలా అందంగా కనిపించే ఏంజెలినా అందుకు భిన్నంగా విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తే, ప్రేక్షకులు ఆదరించరేమోననే భయం పట్టుకుందట. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పరాజయం పాలవుతుందని భావిస్తున్నారట. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. డిస్నీవాళ్లు భయపడినట్లే జరుగుతుందో లేక వాళ్లకి ఈ సినిమా స్వీట్ షాక్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Advertisement
Advertisement