అన్యాసింగ్, సందీప్, తమన్, దయా వన్నెం, శివ చెర్రి
‘‘రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా చాలా బాగుంది. ఫలానా సీన్ బాగుంది. చివర్లో మదర్ సెంటిమెంట్ బాగుంది’ అని చెప్పారు. అదే నిజమైన విజయమని భావిస్తున్నాను. బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్ అనను. దాదాపు రెండేళ్ల తర్వాత మంచి హిట్ సాధించానని చెప్పగలను’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యాసింగ్ కథానాయికగా నటించారు.
విజి. సుబ్రహ్మణ్యన్, దయా పన్నెం, సందీప్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం అనిల్ సుంకర సమర్పణలో ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. మా అబ్బాయి లవ్ ఫెయిల్యూర్‌తో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా 3 నెలల కింద వచ్చి, మా అబ్బాయి చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునే ముందు మా గురించి ఆలోచించేవాడేమో అని బాధపడ్డారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మమ్మల్ని నమ్మి ఈ సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యారని చెప్పగలను.
నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకరగారు హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యం చేసిన సందీప్‌ను మెచ్చుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాను నిర్మించడానికైనా సందీప్‌లాంటి హార్డ్‌వర్కర్ గెలవాలి’’ అన్నారు తమన్. ‘‘నిర్మాతగా మా తొలి సినిమా ఇది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దయా పన్నెం. ‘‘ఈ సినిమా విజయంలో భాగస్వామ్యం కల్పించిన సందీప్ కిషన్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు’’ అన్నారు అన్యా సింగ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment