సందీప్ కిషన్
‘‘నేను నమ్మిన కథను అందరూ నమ్మాలని లేదు. అందుకే ఈ సినిమాకి నేనూ ఓ నిర్మాతగా చేశా. వేరే వాళ్ల డబ్బులు పెట్టినప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించలేను. ఒక్కొక్కళ్ల ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు సందీప్ కిషన్. కార్తీక్ రాజు దర్శకత్వంలో దయా వన్నెం, వీజీ సుబ్రహ్మణ్యన్‌లతో కలసి సందీప్ కిషన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేను’. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్మ్‌ంట్స్ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు.
► నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టం, కానీ ఎప్పుడూ నటిస్తాను అనుకోలేదు. ఆ సినిమాల్లో నటించటం ఇష్టం ఉండదు కూడా. అయితే ఈ సినిమా కథలో హారర్‌ను మించి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటం వల్ల చేయాలనుకున్నాను. అయితే కామెడీ కోసం కామెడీ అన్నట్లు ఉండదు. హారర్ అనేది యూనివర్శల్ జానర్.
► ఈ చిత్రంతో నేను పర్సనల్‌గా ఎంతో కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా కథ 2043లో ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి 2017కు వస్తుంది. అలా ఫ్యూచర్‌కు, ప్రజెంట్‌కు మారుతూ ఉంటుంది. హారర్‌ను దాటి ఒక ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది.
► గత రెండేళ్లలో నేను నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. అందుకే ఈ రెండేళ్లలో నన్ను నేను స్క్రీన్ మీద ఒక్కసారి కూడా చూసుకోలేదు. ఆఖరు సారిగా నన్ను నేను చూసుకొంది ‘నక్షత్రం’ సినిమాలో. ఈ శుక్రవారం చాలా హ్యాపీగా థియేటర్‌కి వెళ్లి నన్ను నేను చూసుకుంటాను. ఈ సినిమాకి మొదటి నుండి ఓ ప్లానింగ్ ప్రకారం అన్ని పనులు దగ్గరుండి నేనే చూసుకున్నాను. ఫస్ట్ టీజర్ బావుండాలి, తర్వాత టీజర్ కంటే ట్రైలర్ బావుండాలి, ఫైనల్‌గా ఈ రెంటికంటే సినిమా బావుండాలి. ఇదే నా ఫైనల్ ప్లాన్. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు ఎక్కడా అసంతృప్తితో వెళ్లకూడదు.
► మా దర్శకుడు కార్తీక్ రాజుకు 46ఏళ్లు. ‘ఒక్కడు’, ‘అంజి’, ‘సైనికుడు’ సినిమాలకు సీజీ వర్క్ చేసే టీమ్‌లో పనిచేశారు. నెలకు రెండున్నర లక్షల జీతం. అంత కంఫర్టబుల్ లైఫ్‌ను వదిలిపెట్టి ఆయన ఫ్యామిలీ దగ్గరకెళ్లి నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పి ఎనిమిదేళ్ల క్రితం ఆ ఉద్యోగం నుండి బయటకు వచ్చారు. ఆ కల ఏడు సంవత్సరాల తర్వాత పట్టాలెక్కి ఈ శుక్రవారం ‘నిను వీడని నీడను నేను’ సినిమాగా రిలీజవుతోంది.
► ఎండ్ ఆఫ్ ది డే ఏదొచ్చినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ నేనే. అందుకని ఎక్కువగా కల్పించుకుంటే ఇన్‌వాల్వ్ అవుతున్నాడు అంటారు. ఇన్‌వాల్వ్ కాకపోతే ఏదన్నా నెగిటివ్ వస్తే ఆ నింద నాకే వస్తుంది. అందుకే నేనే నిర్మించాలని అన్నీ సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు నిర్మాణంలో నేను ఇన్‌వాల్వ్ అయి చేసిన 5 ప్రాజెక్టుల్లో 4 పాస్ అయ్యాను.
► మా అమ్మా,నాన్నలతో నా సినిమాల గురించి డిస్కస్ చేయను. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఒత్తిడి మామూలు వాళ్లకి అర్థం కావు. నేను తప్పు చేసినా మంచి చేసినా అది నేనే తీసుకొంటాను. సినిమా ఆడింది అంటే అది టీమ్ ఎఫర్ట్, ఆడలేదు అంటే నాదే తప్పు. నేను వర్క్ గురించి ఎవరితో అయినా డిస్కస్ చేస్తాను అంటే మా చెల్లెలు మౌనికాతోనే. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్‌లో అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా చేస్తోంది. తను చాలా తెలివైనది. అందుకే కథ గురించి ఆమెతో డిస్కస్ చేస్తాను.
► మనకు అవకాశాలు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఎవరికీ తెలియదు. ‘స్నేహగీతం’, ‘ప్రస్థానం’ సినిమాలు రిలీజయ్యాక సందీప్ అనే నటుడు ఒకడున్నాడు అని అందరికీ తెలిసింది.
► ‘ది ఫ్యామిలీ మ్యాన్’ బిగ్గెస్ట్ బడ్జెట్‌తో అమెజాన్‌కు ఓ వెబ్ సిరీస్ చేశాను. అందులో నేను కమాండో పాత్రలో నటించాను. హిందీలో తీసిన ఆ వెబ్ సిరీస్ తెలుగు, తమిళంలోనూ విడుదలవుతుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్.డి.కె దర్శకత్వం వహించారు.
► విలన్‌గా చేయాలనే ఆలోచన లేదు. దానివల్ల నాకు ఏ ఉపయోగం ఉండదు కూడా. సందీప్ కిషన్ ఎవరో దాదాపు 60 శాతం మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. దాన్ని 90 శాతం మందికి తెలిసేలా చేయాలనేది నా ఆశ. ప్రస్తుతం జి.నాగేశ్వర్ రెడ్డితో ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చేస్తున్నాను. ఇంకో 20 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది. ఇది మంచి హ్యూమరస్ స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment