అన్య సింగ్
‘‘నిను వీడని నీడను నేనే’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని, క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు తమ మనసును కదిలించాయని చెబుతున్నారు’’ అని అన్య సింగ్ అన్నారు. సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ అన్యసింగ్ పంచుకున్న విశేషాలు...
► మాది ఢిల్లీ. అజ్మీర్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలని మానేశా. కాలేజీలో ఉన్నప్పుడు వెడ్డింగ్ ప్లానర్‌తో కలిసి పనిచేశా. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను. నా తొలి హిందీ సినిమా ‘ఖైదీ బాండ్’ లో నా నటన నచ్చి సందీప్ కిషన్, కార్తీక్ రాజు ఈ సినిమా అవకాశం ఇచ్చారు.
► శుక్రవారం ఉదయం కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో సినిమా బాలేదని ఎవరో రాస్తే చదివి, నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్‌కి వెళ్లిపోయా. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారామ్ ఫోన్ చేసి, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి రమ్మని చెప్పారు. సోషల్ మీడియాలో, రివ్యూస్‌లో సినిమా చాలా బాగుందని రాయడంతో సంతోషంగా అనిపించింది. వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. అంతకన్నా ఏం కావాలి. నేను చాలా సంతోషంగా ఉన్నా.
► సినిమా విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. సందీప్ కిషన్‌తో సెల్ఫీలు తీసుకోవటానికి పోటీ పడ్డారు. ‘నిను వీడని నీడను నేనే’ సమయంలో క్యాన్సర్ వల్ల మా నాన్నగారు మరణించారు. దాంతో షాక్‌లోకి వెళ్లాను. తర్వాత నెమ్మదిగా కోలుకున్నాను.
► సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను. హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కష్టపడ్డాను. హారర్ సినిమాలు చూడాలన్నా, చేయాలన్నా భయపడతా. థ్రిల్లర్స్ అంటే ఇష్టం.
► సందీప్ కిషన్‌తో పనిచేయడం సౌకర్యంగా ఉంది. నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. షూటింగ్‌లో నాకు డైలాగులు అర్థం కాకపోతే చెప్పేవాడు. కార్తీక్ రాజు కూడా బాగా సహకరించారు. ఈ సినిమాలో నేను సహజంగా నటించానని, సహజ నటి అంటూ ప్రేక్షకులు అంటుంటే సంతోషంగా ఉంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.. పరవాలేదు.
► తెలుగులో కొంతమంది నిర్మాతలు సంప్రదించారు.. అయితే ఇంకా ఏ ప్రాజెక్టు కూడా ఫైనలైజ్ కాలేదు. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్‌తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే.
Comments
Please login to add a commentAdd a comment