ఇక ఒకేసారి మూడు సినిమాలు చేయను | Nithin interview about bheeshma movie | Sakshi
Sakshi News home page

ఇక ఒకేసారి మూడు సినిమాలు చేయను

Published Thu, Feb 20 2020 2:29 AM | Last Updated on Thu, Feb 20 2020 2:29 AM

Nithin interview about bheeshma movie - Sakshi

నితిన్‌

‘‘ఇష్క్‌’ (2012)కి ముందు నావి 12 సినిమాలు ఆడలేదు. ఇంటికెళ్లిపోతామా? అనే ఆలోచన రాబోతున్నప్పుడు ‘ఇష్క్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆడియన్స్‌ మళ్లీ చాన్స్‌ ఇచ్చారనిపించింది. ఈ మధ్య నావి మూడు సినిమాలు (లై, ఛల్‌ మోహన్‌ రంగ, శ్రీనివాస కళ్యాణం) ఆడలేదు. జాగ్రత్తలు తీసుకుని ‘భీష్మ’ చిత్రం చేశాను. ఈ సినిమా హిట్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ చెప్పిన విశేషాలు.

► ఈ సినిమాలో ‘మీమ్స్‌’ క్రియేటర్‌గా నటించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.  సినిమాలో ఒక లేయర్‌గా మాత్రమే సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రస్తావన ఉంటుంది. సినిమాలో వచ్చే ఓ పొలం ఫైట్‌ను ‘అతడు’ సినిమాలోని ఫైట్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేశాం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత బాగా డ్యాన్స్‌లు చేసే అవకాశం ఈ చిత్రంలో లభించింది. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి హిట్‌ అవుతుందని చెప్పారు.
     
► నేను ‘శ్రీనివాసకల్యాణం’ సినిమా చేస్తున్నప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ కథ చెప్పారు. నా గత మూడు సినిమాలు అంతగా ఆడలేదు కాబట్టి ‘భీష్మ’ స్క్రిప్ట్‌ పూర్తిగా లాక్‌ అయిన తర్వాతే సెట్స్‌కు వెళ్దాం అని చెప్పాను. ఇందుకు కొంత సమయం పట్టింది. అలాగే ‘రంగ్‌ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో...), ‘చెక్‌’ (చంద్రశేఖర్‌ ఏలేటీ దర్శకత్వంలో...) సినిమాల స్క్రిప్ట్స్‌ని కూడా విని ఓకే చేశాను. షూట్‌ కూడా స్టార్ట్‌ చేశాం. ఆ తర్వాత హిందీ హిట్‌ ‘అంధాధూన్‌’ తెలుగు రీమేక్‌ (మేర్లపాకగాంధీ దర్శకత్వంలో..), ‘పవర్‌పేట’ (కృష్ణచైతన్య దర్శకత్వంలో) కథలను కూడా ఓకే చేశాను. గత ఏడాది నా సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ ఈ ఏడాది నావి కనీసం నాలుగు సినిమాలు విడుదలవుతాయి. అయితే జీవితంలో ఇకపై మూడు సినిమాలను ఒకేసారి చేయను. సరిగ్గా నిద్ర లేదు. విశ్రాంతి లేదు. నాకు ఒక్క రోజు గ్యాప్‌ వస్తే చాలు..  నా కాల్షీట్‌ కోసం ముగ్గురు డైరెక్టర్స్‌ కొట్టుకుంటారు (నవ్వుతూ). ఇప్పుడు ‘భీష్మ’ అయిపోయింది కాబట్టి రిలాక్స్‌గా అనిపిస్తోంది.

► జాతీయ అవార్డు సాధించిన హిందీ హిట్‌ ‘అంధాధూన్‌’ తెలుగు రీమేక్‌లో నటించడం రిస్క్‌తో కూడుకున్న పని. కానీ చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్‌ గ్రాఫ్‌ సరిగ్గా  లేదని నాకూ అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాను.

► ఓ సినిమా బాగున్నప్పుడు అభినందనలు తీసుకున్న నేను, మరో సినిమా బాగోలేదన్నప్పుడు విమర్శలను కూడా తీసుకుంటాను. విమర్శలను విశ్లేషించుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుంటాను. కమర్షియల్, డిఫరెంట్‌ సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్దాం అనుకుంటున్నా.

► ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చాను. అప్పట్లో బుట్టో.... ఇప్పుడు ముషారఫ్‌ (‘దిల్‌’ సినిమాలోని డైలాగ్‌) అన్నట్లు నన్ను యంగ్‌ హీరో అంటుంటే హ్యాపీగానే ఉంది కానీ నేను ఇంకా యంగ్‌ ఏంటీ? జట్టు కూడా నెరిసింది. గెడ్డం కూడా తెల్లబడింది అని నా ఇన్నర్‌ఫీలింగ్‌ (నవ్వుతూ).

పెళ్లి ముచ్చట్లు
► పెళ్లనేది జీవితంలో ఓ బిగ్‌ స్టెప్‌. మెంటల్‌గా రెడీ అవ్వాలి. అందుకే కాస్త సమయం పట్టినట్లుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న నిశ్చితార్థం జరుగుతుంది. దుబాయ్‌లో ఏప్రిల్‌ 16న వివాహం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏప్రిల్‌ 21న ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తాం. షాలినీ (నితిన్‌ కాబోయే భార్య)కి నేను నటించిన ‘ఇష్క్, సై’ చిత్రాలంటే ఇష్టం

► నా పెళ్లి గురించి కొందరు హీరోలు సంతోషపడుతుంటే మరికొందరు బాధపడుతున్నారు. నాని ఏమో.. మా పెళ్లి బ్యాచ్‌లోకి రా అని పిలుస్తున్నాడు. రానా ఏమో ‘ఏంటీ బ్రో’ అంటున్నాడు. వరుణ్‌తేజ్‌..  ‘ఏంటీ నితిన్‌ ఇలా చేశావ్‌. నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారు’ అన్నాడు (నవ్వుతూ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement