
నిత్యామీనన్
ఏక్ నిరంజన్ విన్నాం కానీ.. ఏక్ నిరంజని ఏంటి? అనుకుంటున్నారా? లైఫ్‌లో ఏ అమ్మాయీ లేని అబ్బాయిలు ‘నేను ఏక్‌నిరంజన్’ అంటుంటారు కదా. అమ్మాయిలైతే ‘నిరంజని’ అంటే తప్పు కాదేమో. హీరోయిన్ నిత్యామీనన్ పర్సనల్ లైఫ్ స్టేటస్ ఏంటి? సింగిల్. రీల్‌పై కూడా సింగిలే. ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ హీరో పక్కన జతకట్టిన ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు ఒక సినిమాలో సోలోగా కనిపించనున్నారు. సినిమా మొత్తం ఆమె ఒక్కరే కనిపిస్తారు. సమాజంలోని సమస్యలపై పోరాడే రచయిత్రిగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు ‘ప్రాణ’. వీకే ప్రకాశ్ దర్శకత్వంలో నిత్యామీనన్ లీడ్ రోల్‌లో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రముఖ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. ‘‘ప్రాణ’ సినిమాలో ఓన్లీ వన్ క్యారెక్టర్. సమాజంలోని సమస్యలపై పోరాడే ప్రొగ్రెసివ్ రైటర్ క్యారెక్టర్‌లో నిత్యామీనన్ నటిస్తున్నారు. సినిమాలో ఆమె ‘మ్యూజిక్ ఆఫ్ ప్రీడమ్’ అనే బుక్ రాస్తుంది. ఈ బుక్‌కి కీలక పాత్ర ఉంది’’ అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్. అంటే.. ఈ సినిమాకు ఆమే ఒక సైన్యం అన్నమాట. ఈ సినిమా కోసం ‘సింకర్‌నైజ్డ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్’ అనే కొత్త టెక్నాలజీని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వాడుతున్నారు. ఏక కాలంలో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ‘‘బెంగళూరులో ఉండటం వల్ల కన్నడతో ప్రాబ్లమ్ లేదు. మలయాళం నా మాతృభాష. తెలుగు సినిమాల్లో నటించాను కాబట్టి, అది కూడా వచ్చు. హిందీ అర్థం అవుతుంది. కానీ ప్లూయెంట్‌గా మాట్లాడలేను’’ అని చెప్పుకొచ్చారు నిత్యామీనన్.