
ఆ హీరోలకు నో చాన్స్ !
ఆ హీరోలకు నో కాల్‌షీట్స్ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రారంభ దశలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ఫొటో ఆల్బమ్‌లు పట్టుకుని దర్శక నిర్మాతల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నటీమణులు లేకపోలేదు. అలాగే వర్థ్ధమాన హీరోలతో నటించి ఎదిగిన వారిని చూశాం. అలా ఒకటి రెండు విజయాలు వరించగానే ఆది కాలాన్ని మరచిపోవడం, స్టార్ హీరోలతో నటించే అవకాశం రాగానే చిన్న హీరోల సరసన నటించడానికి సుముఖత చూపని హీరోయిన్లను చూస్తున్నాం.
నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఇందుకు అతీతం కాదని నిరూపించుకుంటోంది. ఈ జాణ తొలిరోజుల్లో కోలీవుడ్‌లో ఆర్య తమ్ముడు సత్య, గౌతమ్‌కార్తీక్ లాంటి నవ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం, అమ్మడిని కోలీవుడ్ పట్టించుకోకపోవడంతో టాలీవుడ్‌కు జంప్ చేసింది. అక్కడ ఆదిలో వర్థమాన హీరోలతోనే జత కట్టింది. లక్కీగా ఆ చిత్రాలు సక్సెస్ అవడంతో స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటివారితో నటించే అవకాశాలు వరించాయి.
దీంతో ఆటోమేటిక్‌గా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను అందుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఎర్ర తివాజీ పరుస్తున్నారు. ఆ మధ్య విశాల్ సరసన నటించే అవకాశం వచ్చినా జార విడుచుకున్న ఈ భామకు తాజాగా కార్తీతో రొమాన్స్ చే సే అవకాశం వరించింది. అంతే కాదు తదుపరి కార్తీ సోదరుడు, స్టార్ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో ఇకపై ఇలాంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయం కూడా తీసేసుకుందట. ఇందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సరసన నటిస్తే పారితోషికం ఆ స్థాయిలోనే ముడుతుండడమే. ఇంకేముంది ఇక చిన్న హీరోలకు నో కాల్‌షీట్స్ అంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అలాంటి చిత్రాలను నిరాకరిస్తోందంటున్నారు సినీ వర్గాలు.