ప్రేమించడానికి టైమేది?
ప్రేమించడానికి టైం లేదంటోంది నటి సమంత. టాలీవుడ్‌లో ఫుల్ హైప్‌లో ఉన్న నటి సమంత. గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీదే హవా. అనుష్క, తమన్న, కాజల్ అగర్వాల్ లాంటి సీనియర్ హీరోయిన్లు ఉన్నా సమంతదే పైచేయి కావడం విశేషం. ఎక్కువ విజయాలు ఈ చెన్నై సుందరినే వరించాయి. దీంతో ఈ ఏడాది తన సక్సెస్ పయనాన్ని కొనసాగించనుంది. చేతిలో చాలా చిత్రాలే ఉన్నాయి. ఈ ఏడాది కోలీవుడ్‌లో పాగా వేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం సూర్య సరసన హీరోయిన్‌గా అంజాన్ చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రం కోలీవుడ్‌లో తన విజయ ఖాతాను ఓపెన్ చేస్తాననే ధీమాతో ఉంది. అంతా బాగానే ఉంది కానీ నటుడు సిద్ధార్థ్‌తో షికార్ల మాటేమిటన్న ప్రశ్నకు అదంతా మీడియా కథనాలే, అయినా తానున్న పరిస్థితిలో ప్రేమించడానికి సమయం ఏది? అంటూ దీర్ఘాలు తీస్తోంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా టైమ్ ఉండడం లేదని అంటోంది.