సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌లలో సమంత పేరే ఒక సంచలనం. కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈమె జీవితం చాలా మందికి స్ఫూర్తి దాయకం. తను ఏర్పాటు చేసిన సేవా సంస్థ ద్వారా తన సంపాదనలోని కొంత మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ.. హీరోయిన్‌లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. నటిగా ఈమె జీవితం తెరిచిన పుస్తకమే. తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయకిగా రాణించిన సమంత ది ప్యామిలీ మెన్–2 వెబ్‌సిరీస్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
సమంత చివరిగా నటించిన చిత్రం ఖుషి. ఇందులో తనదైన నటనతో ఆమె ప్రేక్షకులను అలరించారు. కాగా ఇటీవల మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత దాని నుంచి బయటపడడానికి చికిత్స పొందుతున్నారు. కాగా ఇటీవల ఒకవేదికపై సమంత తన బాల్య జీవితం గురించి గుర్తు చేసుకున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాను ఒక పూట భోజనం చేయడానికి కూడా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి తనను బాగా చదువుకోమని అమ్మానాన్న చెప్పేవారన్నారు. తాను కూడా చదువు మీద దృష్టి పెట్టానని చెప్పారు. అలా కళాశాల విద్య వరకు చదివానని, ఇంకా చదవాలని ఆశ ఉన్నా తన కుటుంబ పరిస్థితులు అందుకు సహకరించలేదని చెప్పారు.
దీంతో అంది వచ్చిన ఏ పనినైనా చేశానని చెప్పారు. కాబట్టి ఎవరైనా కలలు కనవచ్చునని అయితే అవి ఆచరణ సాధ్యమేనా అన్న విషయం కూడా ఆలోచించుకోవాలని చెప్పారు. అదే విధంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సమంతను ఓ వ్యక్తి మీ తొలి సంపాదన ఎంత అన్న ప్రశ్నించగా తాను చదువుకుంటున్న రోజుల్లో ఒకస్టార్ హోటల్‌లో జరిగిన ఒక ఈవెంట్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించానని అందుకు గాను తనకు రూ.500 ఇచ్చారని తెలిపారు. అదే తన తొలి సంపాదన అని సమంత బదులిచ్చారు.
(ఇదీ చదవండి: ముగ్గురు ఫ్యాన్స్ మృతి.. ఆ కుటుంబాల బాధ్యత నాదంటూ కన్నీరు పెట్టుకున్న యశ్)
Comments
Please login to add a commentAdd a comment