
పెళ్లి లేదు...ఏమీలేదు: అనుష్క
చెన్నై : అందాల తార అనుష్క పెళ్లి వార్తలను ఆమె మేనేజర్ ఖండించాడు. అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊపుర్లేనని అనుష్క మేనేజర్ స్పష్టం చేశాడు. ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం అనంతరం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అనుష్క మేనేజర్ పైవిధంగా స్పందించాడు.
'బహుబలి' చిత్రం అనంతరం అనుష్క తెలుగులో 'బాగమతి' లో నటించనుంది. ఈ చిత్రానికి ఆమె గతంలోనే సైన్ చేసినట్లు మేనేజనర్ ఐఏఎన్ఎస్కు తెలిపాడు. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ 'లింగా' షూటింగ్తో బిజీగా ఉందన్నందున అనుష్క ....కొత్త చిత్రాలను అంగీకరించలేదని పేర్కొన్నాడు. మరోవైపు అజిత్ సినిమాలో నటిస్తున్నదని, అవన్నీ పూర్తి అయ్యేవరకూ కొత్త చిత్రాలు అంగీకరించటం లేదని తెలిపాడు.
కాగా ఇటీవల ఓ దర్శకుడు అనుష్కను కలిసి కథ చెప్పారట. కథానాయిక చుట్టూ తిరిగే ఆ కథ అనుష్కకు బాగా నచ్చేసిందట. అయినా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దాంతో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే స్వీటీ పెళ్లివార్త విని అప్సెట్ అయిన అభిమానులకు అవన్నీ పుకార్లే అని తేలటం వారికి మాత్రం శుభవార్తే.