
తమిళసినిమా: అది నేను కోరుకున్నదే అంటోంది అందాల భామ అనుష్క. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్న కథానాయకి ఈ జేజెమ్మ. బాహుబలి–2లో అందంతో పాటు, రాజసాన్ని, పౌరుషాన్ని ప్రదర్శించి వావ్ అనిపించుకున్న అనుష్క భాగమతి చిత్రంలో శక్తి యుక్తులతో పాత్రను రక్తిగట్టించి ఈ చిత్రాన్ని విజయతీరం దాటించింది. అలాంటి మంచి నటి ఇప్పుడు ఒక్క చిత్రం కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అం శం. దీంతో అనుష్క గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఈ స్వీటీని ఓ ఇంటిదాన్ని చేయడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నది మినహా ఆ వదంతుల్లో నమ్మదగ్గవి ఏమీలేవు. అనుష్క పెళ్లి కోసం దోష నివారణ పూజలను నిర్వహించారు. అయినా ఇంకా సరైన వరుడు లభించలేదు. అనుష్కకు 36 ఏళ్లు. అయినా ఆమె అందంలో ఏ మాత్రం మార్పు లేదు. అంతగా అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారన్న ప్రశ్నకు ఈ బ్యూటీ ఏం చెప్పిందో చూద్దాం.
శరీరానికి, మనసుకు మధ్య సమతుల్యం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అందం అనేది మనసులోంచి రావాలి. అంతేగానీ దాన్ని బయట నుంచి పొందలేం. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం వల్లే నన్ను నేను అందంగా ఉంచుకోగలుగుతున్నాను. పెరిగే వయసును ఆపడం సాధ్యం కాదు. అయితే వయసైపోతోందని చింతించకూడదు. వయసు అన్నది లెక్కపెట్టుకోవడం కోసమే. దాన్ని సంతోషంగా మార్చుకుంటే వయసు పైబడిపోతోందన్న భావన మనకు రాదు. విరామం లభించినప్పుడు మరో పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో ఏకాంతాన్ని కోరుకుంటాను. నా గురించి ఆలోచించుకుంటాను. నాకు తెలియకుండా ఏదైనా తప్పుచేస్తే అది గుర్తుకొస్తుంది. ఆ తప్పును మళ్లీ చేయకుండా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రస్తుతం చిత్రాల్లో నటించకుండా ఉండడం నేను కోరుకుని తీసుకున్న నిర్ణయమే. శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం అవడంతో కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదు. ఈ విశ్రాంతిని సంతోషంగా అనుభవిస్తున్నాను అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment