పెళ్లి పూజలేనా?
అదేంటో! అనుష్క ఎప్పుడు గుడికి వెళ్లినా... పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశారని గాసిప్‌రాయుళ్లు కథలు అల్లేస్తారు. ఇప్పుడు కూడా అంతే. అందులోనూ అనుష్క వెంట ఆమె మదర్ ప్రఫుల్లా రాజ్‌శెట్టి, బ్రదర్ గుణరంజన్ శెట్టి, మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండడంతో కచ్చితంగా పెళ్లికి సంబంధించిన పూజలు ఏవో జరిపించుంటారని కథ అల్లేశారు.‘బాహుబలి’ విడుదల తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తితో అనుష్క ఏడడుగులు వేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించిన నేపథ్యంలో తాజా పూజలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు మేటర్ ఏంటంటే... రెండు రోజుల క్రితం సాయంత్రం కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు అనుష్క. వీఐపీ సౌకర్యాలు ఏవీ కోరకుండా సాధారణ భక్తులతో కలసి క్యూ లైనులో నిలబడ్డారు. గుడిలోకి ఎంటరయ్యాక ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారట! అనంతరం అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు.
ఆ పూజలు ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే అనుష్క సమాధానమైంది. ఇప్పుడూ మౌనంగానే ఉంటారో? లేక బదులిస్తారో? చూడాలి. ఆమె ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేసింది. ‘‘అనుష్కకు భక్తి ఎక్కువ. రజనీకాంత్ ‘లింగ’ షూటింగ్ టైమ్‌లోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి’ సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది’’ అని అనుష్క తండ్రి విఠల్ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా అనుష్క సందర్శించారు.