సంక్రాంతి బరిలో బాబాయ్, అబ్బాయ్
సంక్రాంతికి టాలీవుడ్ స్క్రీన్ మీద ఆసక్తికరమైన పోటి కనిపించనుంది. ఒకేఫ్యామిలీకి చెందిన నందమూరి స్టార్ హీరోలు సంక్రాంతి సీజన్లో ముఖాముఖీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో, బాలయ్య హీరోగా రూపొందుతున్న డిక్టేటర్ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాయి. దీంతో నందమూరి అభిమానుల్లో కలవరం మొదలైంది.
చాలా కాలం తరువాత టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్, సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నాడు. వన్ ఫెయిల్యూర్ తరువాత ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఎన్టీఆర్ను డిఫరెంట్ లుక్లో ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
లెజెండ్, లయన్ లాంటి వరుస సక్సెస్ల తరువాత బాలకృష్ణ శ్రీవాస్ డైరెక్షన్లో డిక్టేటర్ సినిమా చేస్తున్నాడు. శ్రీవాస్ కూడా సక్సెస్ ట్రాక్ లోనే ఉండటంతో సినిమా సక్సెస్ మీద చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతుంది. ఇలా భారీ అంచనాలున్న రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో ఎవరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.